అంగన్‌వాడీల కలెక్టరేట్‌ ముట్టడి

ABN , First Publish Date - 2023-07-12T00:27:03+05:30 IST

అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

అంగన్‌వాడీల కలెక్టరేట్‌ ముట్టడి
కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ఆందోళన

36 గంటల ధర్నా

స్పందించని ప్రభుత్వం

ఆగ్రహంతో దిగ్బంధం

ఏలూరు కలెక్టరేట్‌, జూలై 11 : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. 36 గంటల మహాధర్నాలో భాగంగా రాత్రంతా కలెక్టరేట్‌ వద్దే నిద్రించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగ్రహంతో కలెక్టరేట్‌ ముట్టడించారు. భారికేడ్లు తోచుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు ఒక్కసారిగా పోలీసులను నెట్టుకుంటూ కలెక్టరేట్‌ మెయిన్‌గేటు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఏపీ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా మంగళవారం కొనసాగింది. కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి అంగన్‌వాడీలు ఆందోళన నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి కలెక్టరేట్‌ వద్దే నిద్రించి వర్షంలో తడుస్తూ నిరసన కొనసాగించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలని నినాదాలు చేశారు. స్పందించిన డీఆర్వో సత్యనారాయణమూర్తి అంగన్‌వాడీల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తొలుత మహాధర్నాను ఉద్దేశించి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవడం అమానుషం అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌, పి.భారతి, టీవీ రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.లెనిన్‌, కుమారి తదితరులు నాయకత్వం వహించారు.

Updated Date - 2023-07-12T00:27:03+05:30 IST