అమ్మ ఒడికి భారీ కోత

ABN , First Publish Date - 2023-06-28T00:03:29+05:30 IST

జిల్లాలో అమ్మఒడి పథకానికి 11,283 మంది లబ్ధిదారులు దూరమయ్యారు.

అమ్మ ఒడికి భారీ కోత

ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 11వేల మందికిపైగా దూరం

జిల్లాలో అమ్మఒడి పథకానికి 11,283 మంది లబ్ధిదారులు దూరమయ్యారు. ఈ పథకానికి గతేడాది ఏలూరు జిల్లాలో 1,84,239 మంది లబ్ధిదారులుండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,72,956కు పడిపోయింది. ఆ మేరకు జిల్లాలో భారీసంఖ్యలో లబ్ధిదారులను అనర్హులుగా చేయడంతో ప్రభుత్వం రూ.16.92 కోట్లకుపైగా మిగులుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే బాల బాలికల సంఖ్య ఏటా పెరుగుతుండగా, దీనికనుగుణంగానే ఈ పథకానికి లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతోనే పలురకాల షరతులు, ఆంక్షలు, నిబంధనలు అమల్లోకి తెచ్చి లబ్ధిదారులను వదిలించుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి.

– ఏలూరు ఎడ్యుకేషన్‌

విద్యుత్‌ బిల్లులే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరంలో అమ్మఒడి పథకానికి 3,39,259 మంది లబ్ధిదారులుండగా రూ.508.89 కోట్లను ఆర్థిక సాయంగా బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఆ తదుపరి ఏడాది 2020–21 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 3,55,051 మంది లబ్ధిదారులకు రూ.532.57 కోట్లను అందజేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత గతేడాది ఏలూరు జిల్లాలో మొత్తం 1,84,239 మంది లబ్ధిదారులున్నట్టు తేల్చి రూ.276.36 కోట్లను బ్యాంకు ఖాతాలకు జమచేయగా, ఇదికాస్తా ఈ ఏడాది భారీకోతతో 1,72,956 మందికి తగ్గించేశారు. ముఖ్యంగా విద్యుత్‌బిల్లుల మొత్తాన్నే ప్రామాణికంగా తీసుకుని నిబంధనల మాటున లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించినట్టు చెబుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూలేనివిధంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆ మేరకు విద్యుత్‌ వినియోగం కూడా భారీగా పెరిగింది. దీనికనుగుణంగానే ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌ల వినియోగం సాధారణంగానే పెరిగింది. ఈ పథకానికి అర్హతల్లో ఒకటైన నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు చేసిన వారిని అనర్హులుగా చేయడానికి ఓ కారణమని తెలుస్తోంది. నెలవారీ రీడింగ్‌ తీయడంలో జాప్యం జరగడం వల్ల విద్యుత్‌ వినియోగం బిల్లులు భారీగా రావడానికి కారణమని సమాచారం. రేషన్‌ కార్డులోని ఆరు దశల (సిక్స్‌ స్టెప్‌)వాలిడేషన్‌ కూడా అమ్మఒడికి అర్హతగాచేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడేళ్లు అమ్మఒడి నగదు సాయాన్ని తల్లుల ఖాతాల్లోకి జమచేసిన ప్రభుత్వం తాజాగా నాలుగోసారి అందిస్తోంది. వచ్చేఏడాది జూన్‌లోనే ఈ పథకం అమలుకావాల్సి ఉండగా, అప్పటికి ఎన్నికలువస్తే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లపాటు అమలుకావాల్సిన పథకం నాలుగేళ్లే అమలైనట్టుగా భావిస్తున్నారు.

విద్యార్థులు 3.42 లక్షలు.. లబ్ధిదారులు 1.73 లక్షలు..

ఏలూరు జిల్లాలో పాఠశాల విద్యలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరంలో మొత్తం 2,68,342మంది బాలబాలికలు చదువుతున్నారు. వీరికి అదనంగా ఇంటర్‌విద్యను బోధించే ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 34,879మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 38,920మంది ఉన్నారు. అర్హతలు సాధించిన కుటుంబంలో ఒకరికి చొప్పున విద్యార్థుల తల్లులకు మొత్తం 1,72,956 మందిని అమ్మఒడికి ఈ ఏడాది ఎంపిక చేశారు.

రూ.15 వేలు కాదు.. రూ.13వేలే..

అమ్మఒడి పథకానికి ఎంపికైన వారికి ఒకొక్కరికి రూ.15వేలు ఇస్తున్నట్టు ఆర్భాటంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా చివరికి ఈ పథకానికి ఎంపికైన తల్లుల ఖాతాలకు జమయ్యేది రూ.13 వేలు మాత్రమే. మిగిలిన రూ.2వేలు పాఠశాల, టాయిలెట్ల నిర్వహణ నిమిత్తం స్కూలు కమిటీలకు జమ చేయడానికి ముందుగానే మినహాయించుకుంటోంది. నేరుగా రూ.15 వేలు ఇస్తున్టట్టు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పాఠశాల, టాయిలెట్లను నిర్వహించేందుకంటూ తమ ప్రమేయం లేకుండానే లాక్కోవడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు..

అమ్మఒడి పథకానికి బుధవారం రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తుండగా, జిల్లాలో లాంఛనప్రాయంగా ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కొందరు లబ్ధిదారులకు డెమో చెక్కులను అందజేయనున్నారు. ఏలూరు జిల్లాలో ఈ పథకానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి 29,594 మంది, దెందులూరు నియోజకవర్గం 30,474 మంది, ఏలూరు 12,603 మంది, కైకలూరు 20,452 మంది, పోలవరం 30,434 మంది, ఉంగుటూరు 16,265 మంది, గోపాలపురం 6,858 మంది, నూజివీడు 26,276 మంది విద్యార్థుల తల్లులు ఎంపికయ్యారు. వీరందరికీ మండలాల వారీగా ఈనెల 30నుంచి జూలై 7వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో డెమో చెక్కులను అందజేయడంతోపాటు, నగదు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

Updated Date - 2023-06-28T00:03:29+05:30 IST