ఆకివీడు సీహెచ్‌సీపై చిన్నచూపు
ABN , First Publish Date - 2023-12-03T00:12:25+05:30 IST
ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మొత్తం ఏడుగురు వైద్యులకు గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు.
రెగ్యులర్ వైద్యులు లేక రోగులు, గర్భిణుల పాట్లు.. బాధితులు భీమవరం, విజయవాడ ఆసుపత్రులకు
ఉన్న ప్రసూతి వైద్యురాలు డిప్యుటేషన్‌పై నరసాపురానికి.. జీతం ఇక్కడ.. సేవలక్కడ !
ఆకివీడు, డిసెంబరు 30 : ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. మొత్తం ఏడుగురు వైద్యులకు గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్రసూతి, చిన్న పిల్లలు, జనరల్ సర్జరీకి సంబంధించి వైద్యులు లేరు. ప్రసూతి వైద్యురాలు భీమవరం నుంచి వారానికి రెండు రోజులు బుధ, శనివారాల్లో ఇక్కడకు వచ్చి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన రోజుల్లో లేకపోవడంతో నార్మల్ డెలివరీలు, ఆపరేషన్లు జరగడం లేదు. మండలంలోని ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి గర్భిణులను సీహెచ్‌సీకి తీసుకుని వస్తే వైద్యురాలు లేకపోవడంతో భీమవరం, ఏలూరు, విజయవాడకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో పూర్తిస్థాయిలో ప్రసూతి వైద్యురాలిని ఇటీవల నియమించారు. అయితే ఆమె ఇక్కడ జాయిన్ అవకుండా నరసాపురం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు క్లినిక్ ఉన్నట్టు అందుకోసమే అక్కడకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీతం మాత్రం ఇక్కడ నుంచే పొందుతున్నారు. ఫలితంగా గర్భిణు లు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. నెలకు 20 డెలివరీలు చేయాల్సి ఉండగా అతి కష్టం మీద రెండో, మూడో నార్మల్ డెలివరీలను ఉన్న వైద్యులే చేస్తున్నా రు. ఆపరేషన్లు అసలు జరగడం లేదు. గతంలో నెలకు 15 వరకూ నార్మల్ డెలివరీలుండేవి. ఎండీ జనరల్ మెడిసిన్ వైద్యులు క్రిటికల్, ఎమర్జెన్సీ, డెంగీ, విషజ్వరాలు, పాయిజన్, పాము కాటు కేసులకు వైద్యమందిస్తున్నారు. ఆయనకు వారానికి మూడు రోజులు తణుకు డిప్యుటేషన్ వేయడంతో ఆయా సమస్యలతో వచ్చే రోగులకు పూరిస్థాయిలో వైద్యం అందడం లేదని వ్యాధిగ్రస్తులు వాపోతున్నారు. దంత వైద్యుడు ఆసుపత్రిలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన రోజులు గ్రామా ల్లోని పీహెచ్‌సీలకు వెళ్లి వైద్య సేవలందిస్తారు. అలాగే దంత వైద్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో వైద్య పరికరాలు లేవు.
సదుపాయాల లేమి.. తగ్గిన ఓపీ
ఆరోగ్యశ్రీ కింద డెలివరీలు, ఆపరేషన్లు అధిక సంఖ్యలో జరగకపోవడంతో బిల్లులు మరుగున పడిపోతున్నాయి. ఆరోగ్య మిత్ర ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోవడంతో ఆరోగ్య శ్రీ సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రివేళల్లో విధులు నిర్వహించే మహిళా వైద్యులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బం దులు పడుతున్నారు. ఒక్కోసారి ఆసుపత్రుల్లోకి పాములు వస్తున్నాయి. కొల్లేరు తీర ప్రాంతానికి వున్న ఏకైక 30 పడకల ఆసుపత్రి ఇది. ఇక్కడకు ఆకివీడు, ఉండి, కాళ్ళ, గణపవరం, నిడమర్రు మండలాలతోపాటు కృష్ణా జిల్లాల నుంచి వ్యాధిగ్ర స్తులు, గర్భిణులు బాలింతలు తదితరులు వస్తూ ఉంటారు. వీరికి సక్రమంగా సేవలందకపోవడంతో రోజుకు 300 ఉండే ఓపీ ప్రస్తుతం 100కు పడిపోయింది. పోస్టుమార్టం నిర్వహణ కు అనుమతులు వచ్చినా మార్చురీని ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు సీహెచ్‌సీ సమస్యలు పరి ష్కరించాలని రోగులు కోరుతున్నారు.