ఈసారీ అంతే..!

ABN , First Publish Date - 2023-06-01T00:19:07+05:30 IST

గోదావరి పశ్చిమ డెల్టా కాలువలకు గురువారం నుంచి నీరు విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం వద్ద ప్రధాన కాలువకు నీరు విడుదల ద్వారా ప్రధాన కాలవలకు నీరు వస్తుంది.

ఈసారీ అంతే..!
ఆచంట మండలం కొడమంచిలిలో తూడుతో తాడేరు మురుగు డ్రెయిన్‌

రూ.20 కోట్లతో తూడు తొలగింపు,

మరమ్మతులకు టెండర్లు

నేటి నుంచి నీటి విడుదల

శివారుకు చేరేందుకు వారం రోజులు

జూన్‌ 15 నాటికి నారుమళ్లు సాధ్యమా..?

భీమవరం, మే 31 : గోదావరి పశ్చిమ డెల్టా కాలువలకు గురువారం నుంచి నీరు విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం వద్ద ప్రధాన కాలువకు నీరు విడుదల ద్వారా ప్రధాన కాలవలకు నీరు వస్తుంది. గత నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో రైతు ప్రతినిధులు నీటి విడుదలపై చర్చించారు. ఆధునికీకరణ పనులు గురించి కూడా చర్చించారు. ఆధునీకరణ పనులకు టెండర్లు పిలిచినప్పటికీ సకాలంలో ప్రారంభం కాలేదు. కాలువలకు నీరు రావడం వల్ల ఆ పనులు ఈసారి కూడా మోక్షం కలగనట్టే..

రూ.20 కోట్ల విలువైన పనులు పూర్తయ్యేనా ?

ప్రతీ ఏడాది కాలువల మరమ్మతు పనులకు సంబంధించిన టెండర్లు సకాలంలో పిలవాలని రైతులు నెత్తీ నోరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ వేసవిలో పంట, మురుగు కాల్వల మరమ్మతులకు, తూడు తొలగింపునకు ఓఅండ్‌ఎం ప్రాతిపదికన రూ. 20 కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే పనులు చాలా ఆలస్యంగా మేనెలలో ప్రారంభించారు. ఫలితంగా ఈ పనులను పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒకటో తేదీ నుంచే నీరు విడుదలకు అధికారులు నిర్ణయించడంతో చాలా వరకు పనులు ఉరుకులు, పరుగులతో హడావుడిగా పూర్తిచేసే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

15 నాటికి నారుమళ్లు సాధ్యమా?

జూన్‌ నెల 15 తేదీ నాటికి నారుమడులు వేసే విధంగా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్ణయించిన విధంగా ప్రారంభమయ్యే అవకాశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటో తేదీనే కాలువలకు నీరు వదిలినప్పటికీ వారు ప్రాంతాలకు చేరేసరికి పది రోజులు పట్టవచ్చు. మరో ఐదు రోజుల్లో నారుమడులు ప్రారంభించాలంటే అవకాశం లేకపోవచ్చని రైతులు చెబుతున్నారు. ప్రతీ ఏటా రెండో పంటకాలానికి సాగునీటి లభ్యతపై అంచనాలు వేయలేని పరిస్థితి నెలకొంది. ముగిసిన ఖరీఫ్‌ కాలానికి సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు వేసిన అంచనాలకు నీటి విడుదలకు పొంతన లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంతుల వారీ విధానంలో కూడా ఇబ్బందులు ఎదుర్కున్నారు. అధికారులు ముందస్తు అంచనాలతో వెళితే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదని అంటున్నారు.

రైతు సంఘాలు చెప్పినా పట్టించుకోలేదు

పాతపాటి మురళీ రామరాజు, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్‌

కాలువలు, డ్రైనేజీల మరమ్మతులు ముందస్తుగానే చేపట్టాలని దీర్ఘకాలంగా రైతులు కోరుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఓఅండ్‌ఎం ప్యాకేజీలో చేపట్టిన పనులు పూర్తికాలేదు. సకాలంలో టెండర్లు పిలిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. వచ్చే పంట ముగింపు నాటికైనా ముందస్తుగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలి.

ఒకటినే నీరు విడుదల చేస్తున్నాం..

నాగార్జునరావు, జిల్లా జలవనరులశాఖ అధికారి

ఈ ఏడాది సీజన్‌కు సంబంధించి జూన్‌ ఒకటో తేదీ నుంచి కాలువలకు నీరు విడుదల చేస్తున్నాం. ఈ నీరు శివారు ప్రాంతాలకు చేరేసరికి నాలుగు, ఐదు రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి రైతులు పనులు ప్రారంభించుకోవవచ్చు.

పశ్చిమ డెల్టా కాలువకు 5న..

ధవళేశ్వరం/నిడదవోలు, మే 31: రబీ అనంతరం మూసివేసిన గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. గతంలో మాదిరి మూడు డెల్టాలకు ఒకేసారి కాకుండా పశ్చిమ డెల్టాకు కాస్త ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నారు. తొలి విడతగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తూర్పుడెల్టా హెడ్‌ స్లూయిజ్‌ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తూర్పు కాలువకు సాగునీటిని విడుదల చేస్తారు. అనంతరం మధ్యడెల్టా కాలువకు సాగునీటిని విడుదల చేస్తామని హెడ్‌వర్క్స్‌ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. అయితే ఏలూరు కాలువకు సిల్ట్‌తీత పనులు జరుగుతున్న కారణంగా జూన్‌ 5వ తేదీన పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ దక్షిణామూర్తి తెలిపారు.

Updated Date - 2023-06-01T00:19:07+05:30 IST