రోడ్డు ఎక్కాలంటే భయం..భయం

ABN , First Publish Date - 2023-05-26T00:12:21+05:30 IST

216 రహదాని అభివృద్ధి చేశారే తప్ప వాటికి అను సంధానంగా ఉన్న పట్టణ, మండలంలో వివిధ గ్రామాలు, వార్డుల్లో ఉన్న రోడ్లను ఎత్తు చేసి అప్రోచ్‌ రోడ్లు వేయలేదు. ఈ కారణంగా దిగువ ఉన్న రోడ్డు నుంచి ఎత్తులో ఉన్న జాతీయ రహదారి ఎక్కే క్రమంలో రోడ్డు అంచు తగిలి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

రోడ్డు ఎక్కాలంటే భయం..భయం
రుస్తుంబాద వద్ద జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ వేయాల్సిన అప్రోచ్‌ రోడ్డు

రహదారి వేశారు..అప్రోచ్‌ మరిచారు

తరుచూ ప్రమాదాలు

నరసాపురం, మే 25: నరసాపురం మండలంలోని వైఎస్‌పాలెం గ్రామానికి చెందిన ఓ రైతు రెండు నెలల క్రితం తోటల్లో పండిన కూరగాయలను అమ్మేం దుకు ద్విచక్ర వాహనంపై పట్టణానికి వస్తుండగా జాతీయ రహదారి ఎక్కే సమయంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. అతని కాలు విరగడంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. గడిచిన ఏడాదిలో పట్టణం, గ్రామాల్లో జాతీయ రహదారి ఎక్కే క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం 216 రహదాని అభివృద్ధి చేశారే తప్ప వాటికి అను సంధానంగా ఉన్న పట్టణ, మండలంలో వివిధ గ్రామాలు, వార్డుల్లో ఉన్న రోడ్లను ఎత్తు చేసి అప్రోచ్‌ రోడ్లు వేయలేదు. ఈ కారణంగా దిగువ ఉన్న రోడ్డు నుంచి ఎత్తులో ఉన్న జాతీయ రహదారి ఎక్కే క్రమంలో రోడ్డు అంచు తగిలి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి వచ్చే 216 జాతీయ రహదారి జిల్లాలో చించినాడ మీదుగా నరసాపురం, మొగల్తూరు మండలాలు మీదుగా సాగుతుంది. సుమారు 55 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి అభివృద్ధి చేశారు. దీనివల్ల రోడ్డు చాలాచోట్ల ఎత్తు పెరిగింది. అప్పటి వరకు ప్రధాన రహదారికి అను సంధానంగా ఉన్న పట్టణ, గ్రామాల్లోని రోడ్లన్నీ పల్లం అయిపోయాయి. ఇలా సుమారు 150 వరకు ఉన్నాయి. అత్యధికంగా పట్టణంలోనే ఉన్నాయి. గతంలో వార్డుల్లోంచి వచ్చే రహదార్లు ప్రధాన రహదారికి సమాంతరంగా ఉండేవి. దీని వల్ల వాహనదారులు సులభంగా రోడ్డు ఎక్కేవారు. జాతీయ రహదారికి అను సంధానంగా ఉన్న రోడ్లును కలుపుతూ అప్రోచ్‌ రోడ్లు వేయకపోవడంతో 216 జాతీయ రహదారి నుంచి కిందకు దిగాలన్నా ఎక్కాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తున్నది. ఎక్కువగా రాత్రి సమయంలోనే ప్రమాదాలకు గురవు తున్నారు. మండలంలోని వైఎస్‌పాలెం, రుస్తుంబాద, సీతారాంపురం, రాజుగారి తోట, మొగల్తూరు, ముత్యా లపల్లి,కాళీపట్నం తదితర ప్రాంతాల్లో అప్రోచ్‌ రహ దారులు వేయలేదు. హెచ్చరిక బోర్డులు కూడా కనిపించవు. కొందరు సర్పంచ్‌లు జాతీయ రహదార్ల అభివృద్ధి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందన లేకపోవడంతో పంచాయతీ నిధులతో పనులు చేయించారు. పట్టణంలో మాత్రం ఈ పనులు జరగలేదు. ఎక్కువుగా గుర్రంబండ్ల సెంటర్‌, రుస్తుంబాద వంతెన, సీతారాంపుర వంతెన వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.

Updated Date - 2023-05-26T00:12:21+05:30 IST