జడ్పీ సమావేశమా.. ఎన్నికల మీటింగా?
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:48 PM
జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని అధికార పార్టీ ఎన్నికల స్టంట్‌గా మార్చేసింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పబ్లిసిటీకి ప్రాధాన్యమిచ్చింది.
- అధికార పార్టీ పబ్లిసిటీకే ప్రాధాన్యం
- ఎలక్షన్ కసరత్తుగా మార్చిన మంత్రి బొత్స
విజయనగరం (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 29: జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని అధికార పార్టీ ఎన్నికల స్టంట్‌గా మార్చేసింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పబ్లిసిటీకి ప్రాధాన్యమిచ్చింది. సమస్యలపై చర్చించకుండా ఎంతసేపూ సొంత డబ్బా.. పరనింద మాదిరిగా సమావేశం సాగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల కసరత్తుగా మార్చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు అంటూనే.. పింఛన్లు, ఆసరా, చేయూత ఇతర పథకాల గురించి డబ్బా కొట్టారు. పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వలంటీర్లకు సూచించారు. సీఎం గురించి గొప్పగా చెప్పిన లబ్ధిదారుల వీడియోలను పంపిస్తే ఆ వలంటీర్లకు బహుమతులు కూడా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ఈ గొప్పలు చెప్పుకోవడం ఏమిటని పలువురు సభ్యులు గుసగుసలాడుకోవడం కనిపించింది.
పీఆర్ ఈఈ సరెండర్
బొబ్బిలి పంచాయతీరాజ్ ఈఈపై తెర్లాం ఎంపీపీ ఉమాలక్ష్మి మంత్రి బొత్సకు ఫిర్యాదు చేశారు. సచివాలయ పనులకు సంబంధించి ప్రభుత్వం అదనంగా ఇస్తామన్న రూ.3.50 లక్షలు ఈఈ శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఇవ్వలేదని, అదనపు పనులు చేస్తేనే ఇస్తానని చెబుతున్నారని మంత్రి దృష్టికి ఆమె తీసుకొచ్చారు. దీంతో మంత్రి ఈఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు కాకుండా సొంత నిర్ణయాలు ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఈఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పీఆర్ ఎస్‌ఈని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో జరిగిన పంటనష్టం, ఉపాధి హమీ పనులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. విజయనగరం జిల్లాలో 4,065 టన్నులు, పార్వతీపురం జిల్లాలో 100 నుంచి 150 టన్నుల మేరకు రంగుమారిన ధాన్యం గుర్తించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడాది 4.25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1.40 లక్షల మాత్రమే వచ్చాయని పౌరసరఫారాల అధికారిణి మీనా కుమారి చెప్పారు. సేకరించిన ధాన్యానానికి ఇప్పటి వరకు రూ.98 కోట్ల బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలో 297.97 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని జేడీ రామారావు వివరించారు. ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న పంటలకు రూ.70 లక్షల పరిహారం వచ్చే అవకాశం ఉందని మంత్రి బొత్స తెలిపారు. రంగుమారిన ధాన్యం ఉంటే అధికారులు మిల్లర్లతో మాట్లాడి రైతులకు నష్టం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎస్.నాగలక్ష్మి , నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.1,045 కోట్లతో జడ్పీ బడ్జెట్ ఆమోదం
విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 29: ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1045.16 కోట్ల అంచనాతో జడ్పీ బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ఏడాది రూ.1016.60 కోట్లు ఖర్చులు పోగా రూ.28.55 కోట్లు మిగులుగా చూపించారు. ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ప్రారంభ నిల్వగా చూపించారు. రాబడి రూ.1010.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతో ప్రారంభ నిల్వను కలపుకొని మొత్తం ఆదాయం రూ.1025.80 కోట్లగా నమోదు చేశారు. బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం, పార్వతీపురం కలెక్టర్లు నాగలక్ష్మి, నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జిల్లా ప్రాదేశిక సభ్యులు పాల్గొన్నారు.