ABN , First Publish Date - 2023-08-17T00:01:45+05:30 IST

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గానికి 281 పనులు మంజూరయ్యాయి. గత ఏడాది మేలో పనులకు ఆమోదం లభించింది కానీ ఇప్పటివరకూ పూర్తయిన పనులు కేవలం 38 మాత్రమే. మిగతా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. పనులు పూర్తిచేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులూ ముందుకు రావడం లేదు. జిల్లా స్థాయిలో ఈ తారతమ్యం చాలా ఎక్కువగా ఉంది.

‘గడప’దాటని పనులు

మంజూరు 2,055.. పూర్తయినవి 315 మాత్రమే

ఆసక్తి చూపని అధికార పార్టీ చోటా నేతలు

బిల్లుల భయమే ప్రధాన కారణం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజాం నియోజకవర్గానికి 281 పనులు మంజూరయ్యాయి. గత ఏడాది మేలో పనులకు ఆమోదం లభించింది కానీ ఇప్పటివరకూ పూర్తయిన పనులు కేవలం 38 మాత్రమే. మిగతా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. పనులు పూర్తిచేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులూ ముందుకు రావడం లేదు. జిల్లా స్థాయిలో ఈ తారతమ్యం చాలా ఎక్కువగా ఉంది.

రాజాం, ఆగస్టు 16:

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా చేపట్టిన పనులు ‘పూర్‌’గతిలో ఉన్నాయి. 2,055 పనులు మంజూరైతే ఇప్పటివరకూ పూర్తయినవి కేవలం 315 మాత్రమే. మిగతా పనులకు అతీగతీ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది మే నుంచి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన తెలిసిందే. ‘నేను సంక్షేమ పథకాల బటన్‌ నొక్కుతాను.. మీరు ప్రజల్లోకి వెళ్లి వివరించండి’ అంటూ సీఎం జగన్‌ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశించారు. వెళ్లకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు డౌటే అన్న ప్రచారమూ జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. అయితే ఎక్కడికక్కడే ప్రజల నుంచి నిలదీతలు ఎదురవ్వడం... నాలుగేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం జగన్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో జగన్‌ ప్రతి ఎమ్మెల్యేకు రూ.3 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధులనే ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ముందుకురాని నాయకులు

గతంలో నిర్మించిన సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో.. గడపగడపకూ మన ప్రభుత్వం పనులకు అలానే మొండిచేయి చూపుతారన్న అనుమానం నేతల్లో ప్రారంభమైంది. పైగా జీఎస్టీ చెల్లింపుల రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవేళ పనులు చేసి తమ పేరిట జీఎస్టీ చెల్లింపులు చేస్తే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని అధికార పార్టీ చోటా నాయకులు భయపడుతున్నారు. దీంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది.

పనులు పూర్తయ్యేనా?

గత ఏడాది మే నుంచి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలను సందర్శిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, రక్షణగోడలు, శానిటేషన్‌, సీసీ రోడ్లు, లింకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 2,337 పనులు ప్రాతిపాదించారు. ఇందుకుగాను రూ.70.77 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం మాత్రం 2,055 పనులకు మాత్రమే ఆమోదం తెలిపింది. రూ.60.98 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటివరకూ 315 పనులు పూర్తిచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రూ.9.04 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా 1700కుపైగా పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎన్నికలకు పట్టుమని పదినెలలు కూడా లేకపోవడంతో ఆ పనులు పూర్తయ్యేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నియోజకవర్గాల వారీగా..

శృంగవరపుకోట నియోజకవర్గంలో 388 పనులు మంజూరుకాగా..పూర్తయినవి కేవలం 55 మాత్రమే. రాజాంలో 281 పనులకుగాను 38, బొబ్బిలిలో 317కుగాను 61, చీపురుపల్లిలో 244కుగాను 50, నెల్లిమర్లలో 333కుగాను 45, విజయనగరంలో 116 పనులకుగాను కేవలం 8 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక గజపతినగరం నియోజక వర్గంలో 271 పనులకుగాను 48 పనులు, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో 105 పనులకుగాను కేవలం పది పనులు మాత్రమే పూర్తయ్యాయి.

ముందుకు రావడంలేదు

జయప్రకాష్‌ .పంచాయితీరాజ్‌శాఖ డిఈ. రాజాం

గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి 281 పనులు మంజూరు కాగా 38 పనులను మాత్రమే చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. కాంట్రాక్టర్లు. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు రావడంలేదు ప్రస్తుతం రాజాం మండలంలో ఆగూరు. అమరాం, గుయ్యన్నవలస గ్రామాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల త్వరలోనే పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం.

----

Updated Date - 2023-08-17T00:01:45+05:30 IST