వస్తాయో..రావో?
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:32 AM
కొత్త సంవత్సరంలో పింఛన్ మొత్తం పెంచుతున్నట్లు వైసీపీ సర్కారు ప్రకటనలు గుప్పిస్తోంది. లబ్ధిదారులకు జనవరిలో రూ.3 వేల వరకు పింఛన్ అందించనున్నట్లు చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నూతనంగా పింఛన్ పొందేందుకు సర్కారు సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు.
అడ్డొస్తున్న నిబంధనలు
ఇప్పటికీ చేరని అర్హుల జాబితా
మార్గదర్శకాలు లేక తలలు పట్టుకుంటున్న సిబ్బంది
ఆందోళనలో దరఖాస్తుదారులు
(గరుగుబిల్లి)
కొత్త సంవత్సరంలో పింఛన్ మొత్తం పెంచుతున్నట్లు వైసీపీ సర్కారు ప్రకటనలు గుప్పిస్తోంది. లబ్ధిదారులకు జనవరిలో రూ.3 వేల వరకు పింఛన్ అందించనున్నట్లు చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నూతనంగా పింఛన్ పొందేందుకు సర్కారు సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు. వివిధ సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 9,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 3 వేల దరఖాస్తులే పరిశీలనకు వచ్చాయి. పింఛన్ల అర్హుల జాబితా ఇంకా వెల్ఫేర్ అసిస్టెంట్లకు చేరలేదు. దీంతో జనవరి నుంచి కొత్త పింఛన్లు వస్తాయో.. రావో అన్న ఆందోనళలో దరఖాస్తుదారులు ఉన్నారు. పెంచిన పింఛన్ మొత్తం అందుకుంటామో..లేదోనని మథనపడుతున్నారు. గతంలో పింఛన్ కోసం ఆధార్, రైస్ కార్డు కాపీలతో పాటు ఆధార్ హిస్టరీ, కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాలను అందించేవారు. అయితే నూతనంగా వాటికి తోడు విద్యుత్ మీటరు బిల్లు, ఓటరు కార్డులను జతపర్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం మంజూరు చేసిన కొత్త గుర్తింపు కార్డు ఇవ్వాలని సచివాలయ సిబ్బంది సూచించడంతో పలువురు బీఎల్‌వోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత పింఛన్ల మంజూరుపై ఉన్నతాధికారుల నుంచి అవసరమైన ఆదేశాలు రాకపోవడంతో మరోవైపు సచివాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సచివాలయంలోని లాగిన్‌లోకి సంబంధిత లబ్ధిదారుని వివరాలు సేకరించిన తర్వాత పింఛన్ మంజూరుకు ఎంపీడీవో లాగిన్‌కు సిఫారసు చేస్తారు. వాటిని ఎంపీడీవో పరిశీలించిన తర్వాత ఆయా దరఖాస్తులను అమరావతిలో సెర్ప్ కార్యాలయానికి పంపింస్తారు. పింఛన్ల మంజూరు అక్కడే జరగాల్సి ఉంది.కాగా జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. ఆన్‌లైన్‌లో నమోదైన పింఛన్ దరఖాస్తుదారుల వివరాలు ప్రస్తుతం కంప్యూటర్‌లో కనిపించడం లేదు. దీంతో పింఛన్లు ఎవరికి మంజూరవుతాయో లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. కాగా గత నెలలో జిల్లా పరిధిలోని 15 మండలాలు, 3 అర్బన్ పరిధిలో 1,44,378 మందికి పలు రకాల పింఛన్లు మంజూరయ్యాయి. వీరికి జనవరి నుంచి రూ.3 వేలు చొప్పున అందించనున్నారు. కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కాగా నిధుల సమస్య నేపథ్యంలో పెంచిన పింఛన్ సొమ్ము పంపిణీ ఎలా? అని సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అర్హత ఉండి పింఛన్ రాని వారికి సమాధానం ఏమి చెప్పాలో తెలియక వారు తికమకపడుతున్నారు.
నిబంధనల మేరకే...
అర్హల దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి పింఛన్ల మంజూరు కోసం ఆయా మండలాల ఎంపీడీవోలు జాబితాలను పంపిస్తున్నారు. ఆ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. అర్హత ఉండి తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు చేపడతాం. దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ పింఛన్లు మంజూరవుతాయి.
- పి.కిరణ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ