పంటను తీసుకోరేం?

ABN , First Publish Date - 2023-02-06T23:55:41+05:30 IST

ధాన్యం కొనుగోలు తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు. పంటను ఎన్నాళ్లు కల్లాల్లో ఉంచుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపు మండి రహదారులపై బైఠాయిస్తూ.. పంటకు అగ్గిపెడుతూ.. రాస్తారోకోలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

పంటను తీసుకోరేం?

జిల్లా అంతటా వివిధ రూపాల్లో రైతుల నిరసనలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ధాన్యం కొనుగోలు తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు. పంటను ఎన్నాళ్లు కల్లాల్లో ఉంచుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపు మండి రహదారులపై బైఠాయిస్తూ.. పంటకు అగ్గిపెడుతూ.. రాస్తారోకోలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా సోమవారం కూడా వివిధ చోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు. జిల్లాలో ఇంతవరకు 2.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా రైతుల వద్ద లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. కొనుగోలుపై అన్ని గ్రామాల రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

పెట్రోల్‌ బాటిళ్లతో ధర్నా

భోగాపురం : పెట్టుబడి కోసం అప్పు చేసి.. రేయింబవళ్లూ కష్టపడి పండించిన పంటను తీసుకోవడానికి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, ధాన్యం తీసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతులు తీవ్రంగా నిరసన తెలిపారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టి రాకపోకలు జరగకుండా ద్వారం ముందు బైఠాయించారు. పెట్రోల్‌ బాటిళ్లను చూపుతూ నిరసన తెలిపారు. పంటను కొనకపోవడం దారుణమని, ధాన్యం తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అధికారులు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించగా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అధికారులు వెళ్లిపోయారు. చాలాసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు మరింతగా ఉద్యమించాలని నిర్ణయించి తాత్కాలికంగా శాంతించారు.

ధాన్యం బస్తాలతో ఆందోళన

గజపతినగరం: పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేఏనాయుడు ఆధ్వర్యంలో రైతులు ధాన్యం బస్తాలతో ర్యాలీ చేశారు. గజపతినగరం, బొండపల్లి మండలాలకు చెందిన రైతులంతా కలిసి సోమవారం ధాన్యం బస్తాలతో జాతీయ రహదారిమీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. కేఏనాయుడు మాట్లాడుతూ వైసీపి అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైతులకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఈ రెండు మండలాలకు సంబంధించి 37వేల 500 మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి రాగా 23వేల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకువస్తున్నా రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. అనంతరం డీటీ సత్యన్నారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీవీవీ గోపాలరాజు, రాంజీరాజు, గజపతినగరం బొండపల్లి , దత్తిరాజేరు పార్టీ మండల అధ్యక్షులు ఎ.లక్ష్మునాయుడు, కోరాడ కృష్ణ, పెద్దింటి మోహన్‌, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి పాల్గొన్నారు.

మల్లమ్మపేట రైతుల ఫిర్యాదు

బొబ్బిలి : బొబ్బిలి పట్టణ పరిధిలోని మల్లమ్మపేట గ్రామానికి చెందిన రైతులు తమ నుంచి దిబ్బగుడ్డివలస రైతుభరోసా కేంద్రం అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిపై గ్రామానికి చెందిన పోల అప్పలనాయుడు, బలగ సూర్యనారాయణ, కర్రి భాస్కరరావుతో సహా మరో 11 మంది రైతులు కలిసి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదులు పంపారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని సుమారు 45 రోజుల నుంచి కొనుగోలు చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

వెదుళ్లవలస రైతుల విన్నపం

కలెక్టరేట్‌: ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1400కు అడుగుతున్నారని గరివిడి మండలం వెదుళ్ళువలస గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు చేయాలంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం(స్పందన)లో విన్నవించుకున్నారు. గ్రామానికి చెందిన 115 మంది రైతుల వద్ద 380 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నాయని, వీటిని కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 20 రోజులుగా కళ్లాల వద్ద ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులు ఎన్‌.జ్ఞాన నాయుడు, అప్పలనాయుడు, సత్యం, పైడిరాజు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:55:41+05:30 IST