ఎందుకీ నిర్లక్ష్యం?

ABN , First Publish Date - 2023-06-26T23:56:57+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను నివారించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణుల వసతిగృహాలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి.

ఎందుకీ నిర్లక్ష్యం?
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో ఉన్న వసతిగృహంలో గర్భిణులు

సిబ్బందికి జీతాలు చెల్లించని వైనం

డైట్‌ కోసం అరకొరగా నిధుల కేటాయింపు

సర్కారు తీరుపై గిరిజన సంఘాల మండిపాటు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలను నివారించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గిరిజన గర్భిణుల వసతిగృహాలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, అంబులైన్స్‌ డ్రైవర్ల జీతాలను కొద్ది నెలలుగా చెల్లించడం లేదు. గర్భిణుల మెనూ కోసం అరకొరగానే నిధులు కేటాయిస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. పట్టించుకునే వారే కరువవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. మొత్తంగా లక్ష్యం నీరుగారుతోంది. ఇటీవల కాలంలో గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని గిరిపుత్రులు, గిరిజన సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా మన్యంలో అనేక గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యం లేదు. దీంతో కొన్ని దశాబ్దాలుగా గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వేళల్లో 108 వంటి వాహనాలు చేరుకోలేకపోవడంతో సకాలంలో వారికి వైద్య సేవలు అందడం లేదు. ప్రధానంగా కొండ శిఖర గ్రామస్థులకైతే నేటికీ డోలీ కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర డోలీలో రోగులను మోసుకుంటూ కొండ దిగాల్సి వస్తోంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులకు చేరుకునేటప్పటికీ ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతోంది. వర్షాకాలంలో అయితే వారి బాధలు రెట్టింపవుతున్నాయి. పీకల్లోతు నీటిలో గెడ్డలు, వాగులు దాటాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో అకారణంగా ఎంతోమంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను నివారించాలని గత టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 2018లో జిల్లాలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరిలో గిరిజన గర్భిణుల కోసం వసతి గృహాలను ఏర్పాటుచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులను డెలివరికీ ఒక నెల ముందుగానే అక్కడ చేర్పించేవారు. వారికి అవసరమైన పౌష్టికాహారంతో పాటు వైద్యసేవలు అందించేవారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను క్షేమంగా అంబులెన్స్‌లో వారి ఇళ్లకు చేర్పించేవారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలకు చాలావరకు చెక్‌పెట్టారు. అప్పట్లో వాటి నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన సందర్భాలున్నాయి. గతంలో గవర్నర్‌గా పనిచేసిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ సాలూరులో గర్భిణుల వసతిగృహాన్ని సందర్శించి అధికారులను ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి వసతిగృహాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న గర్భిణుల వసతిగృహాల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం లేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. రెండు గర్భిణుల వసతిగృహాలకు సంబంధించి పౌష్టికాహారం సరఫరాకు కూడా నిధులు కేటాయించడం లేదు.

జీతాల్లేవ్‌..

వసతిగృహాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందితో పాటు ఇతర సిబ్బందికి గత ఏడాది నవంబరు నుంచి జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జడ్పీ నిధుల నుంచి సిబ్బందికి జీతాలు అందిస్తామని 2021 డిసెంబరు 24న పార్వతీపురం ఐటీడీఏలో జరిగిన పాలకవర్గ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఇంతవరకూ మంజూరు కాలేదు. దీంతో ఐటీడీఏ నుంచి జిల్లా పరిషత్‌కు లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పటివరకు జీతాలు చెల్లించకపోవడంతో అక్కడి సిబ్బంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మంజూరు ఇలా..

వసతిగృహాల నిర్వహణ, గర్భిణులకు పౌష్టికాహారం, సిబ్బంది, అంబులెన్స్‌ డ్రైవర్ల జీతాలకు సంబంధించి ఏడాదికి సుమారు రూ. కోటి కావల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఏటా అరకొరగానే నిధులు కేటాయిస్తోంది. గర్భిణుల మెనూ అమలుకు సైతం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది డైట్‌ కోసం రెండు గర్భిణుల వసతిగృహాలకు ప్రభుత్వం రూ.12 లక్షల మంజూరు చేసింది. ఈ ఏడాది రూ.25 లక్షలే కేటాయించింది. వసతిగృహాలకు నిర్వహణకు అవసరమైన నిధుల్లో 50 శాతం కూడా మంజూరు చేయకపోవడంపై గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు.

కొవరడిన పర్యవేక్షణ

వసతి గృహాలపై అధికారుల పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. దీంతో గిరిజన గర్భిణులు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా తగిన శ్రద్ధ తీసుకోని కారణంగా అంతంతమాత్రంగానే వస్తున్నారు. అప్పట్లో 50 మందికి తక్కువ కాకుండా గర్భిణులు ఉండేవారు. ప్రస్తుతం 12 నుంచి 20లోపే ఉంటున్నారు.

మరో 15 వసతిగృహాలు...

రాష్ట్రంలో మరో 15 గిరిజన గర్భిణుల వసతిగృహాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో పాలకొండ, పాతపట్నంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే జిల్లాలో ఉన్న వసతి గృహాలపై దృష్టిసారించకుండా .. కొత్తవి ఏర్పాటుకు సర్కారు రంగం సిద్ధం చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గిరిజన గర్భిణుల వసతిగృహాల నిర్వహణలో అలసత్వం వీడాలని, ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం తేవాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల మరణాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిధులు రాలేదు

గిరిజన గర్భిణుల వసతిగృహాలకు సంబంధించి జిల్లా పరిషత్‌ నుంచి ఇంకా నిధులు రాలేదు. ఇందుకోసం లేఖ రాశాం. వసతిగృహాల్లో గిరిజన గర్భిణులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాం.

- గంటా వెంకటరమణ, ఉపవైద్యాధికారి, ఐటీడీఏ, పార్వతీపురం

Updated Date - 2023-06-26T23:56:57+05:30 IST