ఎక్కడ చెత్త అక్కడే
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:59 PM
జిల్లాలో మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు నాలుగు రోజులుగా చేపడుతున్న సమ్మె కారణంగా ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది.
- కంపుకొడుతున్న పట్టణాలు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె
రాజాం/బొబ్బిలి, డిసెంబరు 29: జిల్లాలో మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు నాలుగు రోజులుగా చేపడుతున్న సమ్మె కారణంగా ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. క్లాప్ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొంటుండడంతో చెత్త సేకరణ, తరలింపు పూర్తిస్థాయిలో జరగడం లేదు. చెత్త ను తీసుకెళ్లే వారు రాకపోతుండడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వాటిని పశువులు, కుక్కలు చెల్లాచెదురు చేస్తుండడంతో రోడ్లన్నీ చెత్తమయంగా మారుతున్నాయి. విజయనగరం, రాజాం, బొబ్బిలి మునిసిపాలిటీల్లో, నెల్లిమర్ల నగరపంచాయతీలో చెత్త సేకరణ, తరలింపు పూర్తిస్థాయిలో జరగడం లేదు. రాజాం మునిసిపాలిటీలో 34 మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండడంతో 24 వార్డుల్లోనూ చెత్త పేరుకుపో తుంది. నర్సింనాయుడు కాలనీ, ఈశ్వరనారాయణ కాలనీ, డోలపేట, యాతవీధి, తదితర వార్డులో పరిస్థితి దారుణంగా ఉంది. మాధవబజార్, శ్రీనివాసథియేటర్ రోడ్డు, బొబ్బిలి రోడ్డు, శ్రీకాకుళం రోడ్డు, చీపురుపల్లి రహదారిలో మాత్రం రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు 18 మందితో చెత్తను తొల గించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెగ్యులర్ కమిషనర్ 15 రోజులుగా సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జి కమిషనర్ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై దృష్టిపెట్టి చెత్త విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాత్రమే రెగ్యులర్ కార్మికులతో ప్రధాన రహదారుల్లో చెత్తను ఎత్తించేలా చర్యలు చేపడుతున్నారు. మిగిలిన వార్డుల్లో చెత్తను తొలగించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల డస్ట్ బిన్‌ల్లో చెత్త నించిపోయి రహదారులపై చెల్లాచెదురుగా పడి ఉంది. దీంతో తీవ్ర దుర్వాసన వస్తుంది. చెత్తను తొలగించేలా పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బొబ్బిలి మునిసిపాలిటీలో 105 మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సమ్మె కారణంగా తాం డ్రపాపారా య సెంటరు, ఫ్లైఓవర్, తదితర కూడళ్లలో చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. కాలువల్లో మురుగునీరు, చెత్త పేరుకు పోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణ వ్యాప్తంగా 31 వార్డుల్లో కేవలం 27 మంది రెగ్యులర్ కార్మికులతో అధికా రులు పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.