ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతాం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:34 AM
తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
19వ రోజుకు సమ్మె
జిల్లావ్యాప్తంగా నిరసనలు
బెలగాం/పాచిపెంట/కురుపాం/పాలకొండ, డిసెంబరు 30: తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. పార్వతీపురంలో అంగన్‌వాడీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సర్కారు మొండి వైఖరి వీడాలని నినదించారు. గత పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలన్నీ తుంగలో తొక్కి.. చిరుద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసి వేతనం పెంచాలని, కేంద్రాల అద్దెలు చెల్లించాలని, పని భారం తగించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై సర్కారు స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సీఐటీయూ, ఏఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. సాలూరు, కురుపాం, పాలకొండ, పాచిపెంటలో అంగన్‌వాడీలు సచివాలయాల వద్ద నిరసన తెలిపారు. చిన్నారులు, లబ్ధిదారులతో కలిసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సచివాలయంలో ఉద్యోగులకు వినతిపత్రం ఇచ్చారు.