కన్నులపండువగా ఉయ్యాల కంబాల
ABN , First Publish Date - 2023-11-15T00:23:08+05:30 IST
పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. సిరిమానోత్సవంలో చివరి ఘట్టంగా చెప్పుకునే ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు పైడిమాంబ దర్శనం కల్పించారు.
కన్నులపండువగా ఉయ్యాల కంబాల
పైడిమాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నేడు చండీయాగం
విజయనగరం రూరల్, నవంబరు 14: పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. సిరిమానోత్సవంలో చివరి ఘట్టంగా చెప్పుకునే ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ అనంతరం భక్తులకు పైడిమాంబ దర్శనం కల్పించారు. వివిధ రకాల పూలతో పైడిమాంబను ప్రత్యేకంగా అలంకరించారు. పండ్లు, పిండివంటలను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తుల సంఖ్య క్రమేణా పెరిగింది. 11 గంటల తరువాత భక్తులు బారులు తీరారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ ఆలయం వద్ద భక్తుల రద్దీ కన్పించింది. ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పెద్ద వాహనాలను మూడు లాంతర్లు నుంచి గంటస్తంభం వరకూ అనుమతించలేదు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆలయ పురోహితులు, సిబ్బంది, ఈవో సుఽధారాణి పర్యవేక్షణలో పైడిమాంబను ప్రత్యేకంగా అలంకరించారు. ఉయ్యాల కంబాల ఉత్సవానికి సిద్ధం చేశారు. పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేకంగా రూపొందించిన ఉయ్యాల వద్దకు తీసుకువచ్చారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట రమణ పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ఊయలలో ఉంచారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. భక్తులను నియంత్రించేందుకు దేవదాయ సిబ్బంది క్యూలైన్లో వున్నవారిని వేగంగా ముందుకు కదిలించారు. దీంతో ఎక్కువ మంది భక్తులు ఉయ్యాల కంబాల వేడుకను కనులారా వీక్షించారు. గత నెల 30, 31 తేదీల్లో జరిగిన తొలేళ్లు, సిరిమానోత్సవం రోజున పైడిమాంబ దర్శనం చేసుకోలేని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పైడిమాంబను దర్శించుకున్నారు. మహిళా భక్తులు ముర్రాటలతో వచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాగా బుధవారం పైడిమాంబ మాలధారణ చేసిన భక్తులు చండీయాగం నిర్వహించనున్నారు. ఈ మేరకు పైడిమాంబ దీక్షాదారుల సంఘం ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ ఈ చండీయాగం పైడిమాంబ వనంగుడిలో నిర్వహించనున్నారు. సిరిమానోత్సవ కార్యక్రమంలో భాగంగా గత 20 రోజులుగా వనంగుడి, చదురుగుడి వద్ద జరుగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగిశాయి. చివరివరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.