జిల్లాలో అర్బన్ మండలం
ABN , First Publish Date - 2023-03-02T00:12:53+05:30 IST
జిల్లాలో ప్రస్తుతం ఉన్న 27 రెవెన్యూ మండలాలకు అదనంగా మరో మండలం ఆవిర్భవించనుంది. అంటే 28మండలాలు కానున్నాయి. ఇపుడున్న విజయనగరం మండలాన్ని రెండుగా విభజిస్తున్నారు.
కొత్తగా విజయనగరం అర్బన్ రెవెన్యూ మండలం ఏర్పాటు
నోటిఫికేషన్ విడుదల
అభ్యంతరాలు స్వీకరణకు గడువు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రస్తుతం ఉన్న 27 రెవెన్యూ మండలాలకు అదనంగా మరో మండలం ఆవిర్భవించనుంది. అంటే 28మండలాలు కానున్నాయి. ఇపుడున్న విజయనగరం మండలాన్ని రెండుగా విభజిస్తున్నారు. ఇంతవరకు పట్టణ పరిధిలోని వార్డులకు, మండల పరిధిలోని గ్రామాలకు ఒకే మండల రెవెన్యూ కేంద్రం కొనసాగుతోంది. అర్బన్ మండలాన్ని వేరేగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లతో అర్బన్ రెవెన్యూ మండలం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రూరల్ మండల పరిధిలోని గుంకలాం, ద్వారపూడి, కొండకరకాం, సిరియాలపేట, రాకోడు, పినవేమలి, కోరుకొండ, సారిక, జగన్నాథపురం(జొన్నవలస), దుప్పాడ, చెల్లూరు, నారాయణపురం, మలిచర్ల గ్రామాలతో మొత్తం 13గ్రామ పంచాయతీలను రూరల్ రెవెన్యూ మండల పరిధిలోకి తీసుకురానున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతిపాదించిన అర్బన్, రూరల్ మండలాలపై ఎటువంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు 30 రోజులు గడువు ఇచ్చారు. కలెక్టర్‌కు అడ్రస్ చేస్తూ 30రోజుల్లోగా అభ్యంతరాలను పంపించాలని పేర్కొన్నారు.