ఏనుగుల దాడిలో ట్రాకర్‌ మృతి

ABN , First Publish Date - 2023-02-07T00:06:02+05:30 IST

గజరాజుల కారణంగా జిల్లాలో మరో ప్రాణనష్టం సంభవించింది. వాటి దాడిలో ఈ సారి ఏకంగా ట్రాకరే మృతి చెందాడు.

ఏనుగుల దాడిలో ట్రాకర్‌ మృతి
మృతిచెందిన లక్ష్మీనారాయణ (ఫైల్‌)

హడలెత్తిపోతున్న గ్రామస్థులు

తక్షణమే తరలించాలని డిమాండ్‌

భామిని: గజరాజుల కారణంగా జిల్లాలో మరో ప్రాణనష్టం సంభవించింది. వాటి దాడిలో ఈ సారి ఏకంగా ట్రాకరే మృతి చెందాడు. సోమవారం భామిని మండలంలో చోటచేసుకున్న ఘటనతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. స్థానికులు, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పసుకుడిలో గత ఆరురోజులుగా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం కూడా అవి ఆయా పరిసరాల్లో సంచరించాయి. సాయంత్రానికి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పయనమవుతూ.. ఒక్కసారిగా వెనుదిరిగాయి. ఇదే సమయంలో వాటి సంచారాన్ని పరిశీలిస్తున్న ట్రాకర్‌ లోకొండ లక్ష్మీనారాయణ (25) గజరాజులను తప్పించుకునే ప్రయత్నంలో కాలుజారి కింద పడ్డాడు. దీంతో ఏనుగులు ఆయనపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడున్న సిబ్బంది హుటాహుటిన మృతిడిని పసుకుడి సమీపానికి తరలించారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీట్‌ ఆఫీసర్‌ బి.హరిబాబు ఉన్నతాధి కారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా భామిని మండలంలో 13 మంది ఏనుగుల కేర్‌ ట్రాకర్స్‌గా అటవీశాఖ నియమించగా, లక్ష్మీనారాయణ ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం పాతపట్నం మండలం తిడ్డిమి. మృతునికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నదమ్ములున్నారు. మొత్తంగా ఈ ఘటనతో మండలవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నెలరోజుల్లో పెళ్లి అనుకుంటే..

ఏనుగుల దాడిలో మృతి చెందిన లక్ష్మీనారాయణకు నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే కొద్దిరోజులుగా సెలవులో ఉన్న ఆయన సోమవారమే విధుల్లోకి వచ్చి ఇలా మృత్యువాత పడడంపై కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది జనవరి 9న కొమరాడ మండలం దుగ్గిలో రాజబాబు అనే ట్రాకర్‌ గజరాజుల దాడిలో మృతి చెందాడు. సరిగ్గా ఏడాది తర్వాత జిల్లాలో మరో ట్రాకర్‌ అదేవిధంగా మరణించడం చర్చనీయాంశమవుతోంది.

Updated Date - 2023-02-07T00:06:03+05:30 IST