ఇక్కడో చెరువుండేది

ABN , First Publish Date - 2023-06-11T00:01:43+05:30 IST

అవును.. ఇక్కడో చెరువుండేది. ఇప్పుడు దాని ఆనవాళ్లే లేకుండా పోయింది. ఓ రియల్టర్‌ ధన దాహానికి అది బలై పోయింది. దాదాపు 8 ఎకరాలు కబ్జా చెరలో చిక్కుకు పోయింది. ప్లాట్లు వేసి అమ్ముతున్నా.. రూ.లక్షల లావాదేవీలు సాగుతున్నా అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారు. చివరకు కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. రాజాం పట్టణ సమీపంలోని మొగులువలస గ్రామంలో ఉన్న ఎరుకువాని చెరువు దుస్థితి ఇది.

ఇక్కడో చెరువుండేది
పూర్తిగా చదును చేసిన చెరువు

8 ఎకరాలు కబ్జా చేసిన రియల్టర్‌

లక్షల రూపాయల్లో లావాదేవీలు

ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

అవును.. ఇక్కడో చెరువుండేది. ఇప్పుడు దాని ఆనవాళ్లే లేకుండా పోయింది. ఓ రియల్టర్‌ ధన దాహానికి అది బలై పోయింది. దాదాపు 8 ఎకరాలు కబ్జా చెరలో చిక్కుకు పోయింది. ప్లాట్లు వేసి అమ్ముతున్నా.. రూ.లక్షల లావాదేవీలు సాగుతున్నా అధికారులు మాత్రం మిన్నకుండి పోతున్నారు. చివరకు కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. రాజాం పట్టణ సమీపంలోని మొగులువలస గ్రామంలో ఉన్న ఎరుకువాని చెరువు దుస్థితి ఇది.

రాజాం, జూన్‌ 10:

రాజాంకు చెందిన ఒక వ్యాపారి ఎరుకువానిచెరువును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనువుగా మార్చేశాడు. స్థలాలుగా విభజించి ఒక్కో స్థలం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తున్నాడు. ముందుగా అక్కడకు సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అనంతరం చెరువును కబ్జా చేసి ఇంటి పక్కనుంచే రియల్‌ వ్యాపారం ప్రారంభించేశాడు. చెరువు భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చేసి విక్రయాలు మొదలు పెట్టాడు.

ఇలా మొదలు

మొగులువలస గ్రామానికి చెందిన సర్వే నెంబరు1లో ఎరుకువాని చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం 8 ఎకరాలు కాగా ప్రస్తుతం 80 సెంట్లు కూడా లేదు. రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో శ్రీచైతన్య పాటశాలకు ఎదురుగా ప్రధాన రహదారికి ఆనుకొని ఈ చెరువు ఉంది. రాజాంకు చెందిన ఓ వ్యాపారి చెరువుకు ఆనుకొని ఓ ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టిన వ్యాపారి దృష్టి చెరువుపై పడింది. అంచెలంచెలుగా ఎరుకువాని చెరువును ఆక్రమించి ఇళ్ల స్థలాలుగా మార్చేసి విక్రయాలు చేపట్టి లక్షలు రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఫిర్యాదు చేసినా..

చెరువు గర్భంలోని ఒక్కో స్థలంపై రూ.6 లక్షల నుంచి రూ.8లక్షలు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొగులువలస గ్రామస్థుడు మజ్జి హరనాథరావుతో పాటు మరికొంతమంది రైతులు ఐదు నెలల కిందట కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ వ్యాపారి అక్కడ నిర్మించిన ఇంటిని బినామీ వ్యక్తికి విక్రయించినట్టు బినామీ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించి రెవెన్యూ అధికారుల కళ్లు కప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఇంటిని, చెరువును పరిశీలించిన రెవెన్యూ అధికారి ఎరుకువానిచెరువు అక్రమణలకు గురైనట్లు గుర్తించడమే కాకుండా ఇంటి నిర్మాణం కూడా చెరువులో ఉందని నిర్థారణకు వచ్చారు. ఇంటి భాగాన్ని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఆ ఇల్లు తన స్వాధీనంలో లేదని తప్పించుకున్న ఆ వ్యాపారి తరువాత ఆ ఇంటి పక్కన ఉన్న చెరువు స్థలాన్ని కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించేశాడు.

పట్టించుకోకుంటే ఆందోళన చేస్తాం

ఆక్రమణలు తొలగించకుంటే ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని, పంట భూములు బీడు భూములగా మారుతున్నాయని గ్రామస్థుడు మజ్జి హరనాధరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరాడు. స్పందించక పోతే చెరువువద్ద ఆందోళన చేస్తామన్నారు.

పరిశీలించి చర్య తీసుకుంటాం

నేను తహసీల్దార్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టాను. మండలంపై పూర్తిస్దాయిలో అవగాహన లేదు. ఎరుకువాని చెరువు ఆక్రమణలకు గురైన విషయంపై స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జిల్లా, డివిజన్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తాను.

- కృష్ణంరాజు, తహసీల్దార్‌, రాజాం

Updated Date - 2023-06-11T00:01:43+05:30 IST