నీరూ లేదు.. దారీ లేదు

ABN , First Publish Date - 2023-03-26T00:19:18+05:30 IST

ఇళ్లు గడువులోగా నిర్మించుకోవాలని, లేకుంటే స్థలాలు తీసుకుంటామని బెదిరిస్తున్న అధికారులు, నేతలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. స్థలాలు ఇచ్చి రెండేళ్లు దాటినా చాలా చోట్ల నివాసయోగ్యంగా కూడా వాటిని మార్చలేకపోయారు.

నీరూ లేదు.. దారీ లేదు
జగనన్న కాలనీకి ఏర్పాటు చేసిన రహదారి దుస్థితి

దయనీయంగా రాజాం జగనన్న కాలనీ

రాజాం, మార్చి 25: ఇళ్లు గడువులోగా నిర్మించుకోవాలని, లేకుంటే స్థలాలు తీసుకుంటామని బెదిరిస్తున్న అధికారులు, నేతలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. స్థలాలు ఇచ్చి రెండేళ్లు దాటినా చాలా చోట్ల నివాసయోగ్యంగా కూడా వాటిని మార్చలేకపోయారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించేందుకు లబ్ధిదారులు చాలా అవస్థలు పడుతున్నారు. అక్కడి పరిస్థితులు చూసి కొందరు నిర్మాణాల్ని ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదు. రాజాం సమీపంలోని కంచరాంలో ఏర్పాటుచేసిన జగనన్నకాలనీ దుస్థితి ఇందుకో ఉదాహరణ. ఇక్కడి 33 ఎకరాల్లో రాజాం మున్సిపాలటీ పరిధి లోని నిరుపేదలకు మొదటి విడతగా 965 గృహాలు, రెండో విడతగా 550 గృహాలకు ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేశారు. వీటన్నింటిలో ఇంతవరకూ 260 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాల కారణంగా దారి లేక కొద్దిరోజులుగా పనులు మొత్తం ఆగిపోయాయి. ఇటీవల కంచరాం గ్రామం నుంచి కాలనీ వరకూ రహదారి నిర్మాణానికి రూ2.05 కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌ మట్టిపనులు చేపట్టిన సమయంలో వర్షాలు పడ్డాయి. దీంతో రోడ్డు అధ్వానంగా మారింది. కాలనీలోకి ద్విచక్రవాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు నీటి సౌకర్యం కోసం బోరు తవ్వి పైపులు దించి వదిలేశారు. నెలలుగా విద్యుత్‌ స్తంభాలకు వైర్లను కూడా అమర్చలేకపోయారు.

Updated Date - 2023-03-26T00:19:18+05:30 IST