తగ్గేది లేదు
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:28 PM
జిల్లాలో అంగన్‌వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.
-17వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- పోస్టు కార్డుల ద్వారా సీఎంకు వినతి
పాలకొండ/సాలూరు/బెలగాం/కొమరాడ, డిసెంబరు 28: జిల్లాలో అంగన్‌వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. 17వ రోజు గురువారం కూడా ఆందోళనలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని పోస్టు కార్డులపై రాసి సీఎం జగన్మోహన్‌రెడ్డికి పోస్టు చేశారు. కలెక్టరేట్ వద్దచేపట్టిన సమ్మెలో అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. చర్చల పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. సంఘం ప్రతినిధులు సాలూరు గౌరీమణి, మర్రాపు అలివేలు, జ్యోతి పాల్గొన్నారు. పాలకొండలో అంగన్‌వాడీ కార్యకర్తలు పోస్టు కార్డులపై సమస్యలు రాసి తహసీల్దార్ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి పోస్టుబాక్సులో వేశారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.హిమప్రభ, కోశాధికారి బి.అమరవేణి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు ఎ.పద్మ తదితరులు పాల్గొన్నారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అంగన్‌వాడీలు దీక్షను కొనసాగించారు. జీతాలు పెంచాలని పోస్టు కార్డులపై రాసి ముఖ్యమంత్రికి పంపించారు. వీరికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు బలగ రాధ, సీఐటీయూ నాయకుడు ఎన్‌వై.నాయుడు పాల్గొన్నారు. కొమరాడ మండలంలో అంగన్‌వాడీలు వరి గడ్డిని నోటి ముందు పెట్టుకుని నిరసన తెలిపారు. పండగ పూట ఈ గడ్డే తినమంటారా అంటూ నినాదాలు చేశారు.
పౌష్టికాహారం అందక ఇబ్బందులు
(పార్వతీపురం ఆంధ్రజ్యోతి)
అంగన్‌వాడీల సమ్మెతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1425 ప్రధాన కేంద్రాలు, 639 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లలు 7,633 మంది, ఒక సంవత్సర నుంచి మూడేళ్లలోపు పిల్లలు 22,917మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 22,167 మంది, గర్భిణులు 5,405మంది, బాలింతలు 6,441 మంది ఉన్నారు. వీరందరికీ అంగన్‌వాడీ సిబ్బంది సమ్మెతో పౌష్టికాహారం అందని పరిస్థితి ఏర్పడింది. సచివాలయ మహిళా పోలీసులు, కార్యదర్శుల ద్వారా బాలామృతం, న్యూ ట్రీషన్ కిట్లను నామమాత్రంగా పంపిణీ చేస్తున్నారు. మిగిలిన పౌష్టికాహారాన్ని అందించడం లేదు. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 22,167 మంది పిల్లలు ప్రీస్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెతో వీరికి వచ్చిన ఏబీసీడీలు కూడా మరిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించి కేంద్రాలను తెరిపించేలా చూడాలని కోరుతున్నారు.