టౌన్ రైల్వే స్టేషన్ ఎత్తివేయం
ABN , First Publish Date - 2023-03-05T00:10:51+05:30 IST
పార్వతీపురంలో బెలగాం రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, టౌన్ స్టేషన్ కొనసాగుతుందని డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ శతపతి తెలిపారు.
రెండు చోట్లా ప్రతి రైళ్లకు స్టాప్ అసాధ్యం
డీఆర్‌ఎం అనూప్‌కుమార్ శతపతి
పార్వతీపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో బెలగాం రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, టౌన్ స్టేషన్ కొనసాగుతుందని డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ శతపతి తెలిపారు. శనివారం స్థానిక బెలగాం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ... దేశంలో 16 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పార్వతీపురంలో బెలగాం రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి రాయగడ వరకు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సుమారు రూ.100కోట్లు వెచ్చించ నున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలో బెలగాం రైల్వే స్టేషన్‌తో పాటు పట్టణ రైల్వే స్టేషన్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్టణ రైల్వే స్టేషన్‌ను ఎత్తివేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రైల్వే శాఖ పెద్దపీట వేస్తుందని, ఎక్కడా ఏ స్టేషన్‌ను ఎత్తివేసే పరిస్థితి లేదని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెలగాం, పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్లలో ప్రతి ఎక్స్‌ప్రెస్‌కు స్టాప్ ఏర్పాటు చేయలేమన్నారు. ఒక స్టేషన్‌లో మాత్రమే స్టాప్ ఉంటుందని తెలిపారు. ఆయన వెంట స్టేషన్ మాస్టారు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
మౌలిక సదుపాయాలు మెరుగుపర్చండి
పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌ను కొనసాగిస్తూ.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కోరారు. ఈ మేరకు బెలగాం రైల్వే స్టేషన్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ శతపతికి వినతిపత్రం అందించారు. బెలగాం ,పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లను నిలపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఆర్‌ఎం స్పందిస్తూ.. పట్టణ రైల్వే స్టేషన్ కొనసాగుతుందని, ప్రయాణికులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు ఉదయభాను, వెంకటరావు, మోహన్, గౌరు నాయుడు, దేవిచంద్రమౌళి, మధుసూదన్‌రావు, భాస్కరరావు, శ్రీనివాసరావు, జి.రవికుమార్, రవిశంకర్, నాయుడు, ప్రభాకరరావు, బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.