వైద్యంలో ‘స్థాయి’ మారలే!

ABN , First Publish Date - 2023-09-22T00:01:37+05:30 IST

జ్వరంతో బాదపడుతున్న ఓ యువతి ఇటీవల శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు బాగా నీరసంగా ఉండడాన్ని గమనించారు. సెలైన్‌ బాటిల్స్‌ ఎక్కించాలన్నారు. కానీ బెడ్‌లు ఖాళీగా లేవు. దీంతో బల్లపైనే వైద్యం అందించారు.

వైద్యంలో ‘స్థాయి’ మారలే!
శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి

వైద్యంలో ‘స్థాయి’ మారలే!

చాలీచాలని పడకలతో ఇబ్బందులు

రోగులు నిల్చొనేందుకూ సరిపడని గదులు

కనిపించని అత్యవసర వైద్యసేవలు

ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రి దుస్థితి ఇది

శృంగవరపుకోట, సెప్టెంబరు 21:

- జ్వరంతో బాదపడుతున్న ఓ యువతి ఇటీవల శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు బాగా నీరసంగా ఉండడాన్ని గమనించారు. సెలైన్‌ బాటిల్స్‌ ఎక్కించాలన్నారు. కానీ బెడ్‌లు ఖాళీగా లేవు. దీంతో బల్లపైనే వైద్యం అందించారు.

- ఎస్‌.కోట సామాజిక ఆసుపత్రిలో సరిపడాగదులు లేక ఒక్కో గదిలో ముగ్గురేసి వైద్యులు ఓపీ చూస్తున్నారు. వైద్యుల కోసం గదుల ముందు నిల్చొంటున్న రోగుల్లో ఒకరు లోపలకు వెళ్తే మరొకరు బయటకు వచ్చేందుకు కూడా దారి ఉండడం లేదు.

శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిని మూడేళ్ల క్రితం 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచారు. దీంతో ప్రాంత్రీయ ఆసుపత్రిగా పేరు మారింది. పడకలు మాత్రం పెరగలేదు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఎవరో ఒకరు బయటకు వెళ్తేనే మరొక మంచం అందుబాటులోకి వస్తోంది. అత్యవసరంగా సిలైన్‌ బాటిల్‌ ఎక్కించాలంటే వరండాలోని బెంచీలే దిక్కవుతున్నాయి. బెడ్‌లపై సీట్లు కప్పడం లేదు. బెడ్‌సీటు మారిస్తే మరో బెడ్‌ సీటును వెంటనే వేయాలి. అలా జరగడం లేదు. దీంతో రోగులు తాము తెచ్చుకున్న దుప్పట్లను బెడ్‌లపై వేసుకుంటున్నారు. కొన్ని బెడ్‌లు చిరిగిపోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. ఈ ఆసుపత్రిని ప్రాంతీయ ఆసుపత్రిగా ఆధునికీకరించేందుకు రూ.12.60 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాల నిర్మాణం జరుగుతోంది. అయితే సక్రమంగా బిల్లులు అందకపోవడంతో రెండేళ్ల క్రితం పూర్తికావాల్సిన భవనాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో పాత భవనంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాంతీయ ఆసుపత్రిగా రూపాంతరం చెందిన తరువాత వైద్యులు, సిబ్బంది రెండింతలు పెరిగారు. అన్ని రకాల సేవలు అందిస్తున్నారని ప్రచారం జరగడంతో నియోజకవర్గ పరిధిలోని ఎస్‌.కోట, వేపాడ, జామి, కొత్తవలస, ఎల్‌.కోట, గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, అరకు, డుంబ్రిగూడ వంటి గిరిజన ప్రాంతాల నుంచి కూడా రోగులు తరలివస్తున్నారు. ఓపీ విపరీతంగా పెరిగింది. సరిపడా భవనాలు లేక వీరిని చూసేందుకు ఒక్కో గదిలో ముగ్గురు వైద్యులు కూర్చొంటున్నారు. ఇరుకుగా వున్న గదిలో ముగ్గురు వైద్యుల వద్దకు వెళ్లే క్రమంలో ఒకరు లోనకెళితే మరొకరు బయటకు వచ్చేందుకు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది.

- ప్రాంతీయ ఆసుపత్రి కావడంతో అన్ని విభాగాలకు పోస్టులు అయితే మంజూరయ్యాయి. వీరిలో కొందరు సెలవులో వుంటే మరికొందరు బదిలీపై వేరే ఆసుపత్రులకు వెళ్లారు. దీంతో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికీ అత్యవసరం పేరుతో రోగులను తరచూ కేంద్రాసుపత్రులకు తరలిస్తున్నారు. ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు అకస్మాత్తుగా అత్యవసర చికిత్సకు పెద్దాసుపత్రులకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో రోగి బంధువులు పడుతున్న టెన్సన్‌ అంతా ఇంతా కాదు. చివరకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వారడిగినంత ఇచ్చేందుకు అప్పులు చేస్తున్నారు. అయినా ఒక్కోసారి రోగుల ప్రాణాలు దక్కడం లేదు. అత్యవసర వైద్యం అందించలేని ఈ స్థాయి పెంపు దేనికంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-09-22T00:01:37+05:30 IST