ప్రాణం తీసిన కుంపటి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:09 AM
పాపం వృద్ధుడు. చలి నుంచి రక్షణకు తాను నిద్రిస్తున్న మంచం కింద కుంపటి పెట్టుకున్నాడు. వెచ్చగా ఉంటే నిద్రపడుతుందని భావించాడు.
ప్రాణం తీసిన కుంపటి
అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం
వేపాడ, డిసెంబరు 16: పాపం వృద్ధుడు. చలి నుంచి రక్షణకు తాను నిద్రిస్తున్న మంచం కింద కుంపటి పెట్టుకున్నాడు. వెచ్చగా ఉంటే నిద్రపడుతుందని భావించాడు. కానీ విధి మరోలా చేసింది. కుంపటి రాజుకుని పూరిపాకను దగ్ధం చేసి వృద్ధుడినీ సజీవ దహనం చేసింది. బొద్దాం గ్రామంలో శనివారం వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
లక్కవరపుకోట మండలం చందులూరు గ్రామానికి చెందిన శిమ్మ నాగమయ్య(72), భార్యతో కలిసి వేపాడ మండలం బొద్దాం గ్రామంలో కుమార్తె బత్తిన సూరమ్మ దగ్గర ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే ఇంటి సమీపంలోని పశువుల పాకలో నాగమయ్య నిద్రకు ఉపక్రమించాడు. చలి తీవ్రంగా ఉండడంతో మంచం కింద కుంపటి పెట్టుకున్నాడు. అయితే మంచంపై ఉన్న దుప్పటికి నిప్పు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు చెలరేగి పూరిపాక పూర్తిగా కాలిపోయింది. పశువులు తప్పించుకుని పారిపోయాయి. పాపం వృద్ధుడు సకాలంలో లేవలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. నాగమయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వెంటనే మంచంపై నుంచి లేవలేక ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని స్థానికులు అంటున్నారు. నాగమయ్య భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.