నీరు తోడారో.. కేసు పెడతా!
ABN , First Publish Date - 2023-11-06T23:48:23+05:30 IST
వర్షం కురవలేదు. నోటికాడికి వచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతోంది. ఊరి దగ్గర్లోనే చెరువు ఉంది. దాన్నుంచి నీరు తోడుకోవాలనుకున్నారు. పంటకు ఒక తడైనా ఇవ్వాలనుకున్నారు. చెరువుకు ఇంజన్ బిగించే యత్నం చేశారు. అంతే.. ఓ వైసీపీ నేత అడ్డు తగిలాడు. ‘నీరు తోడారో.. కేసు పెడతా’ అంటూ బెదిరించాడు. దీంతో ఆ రైతులు దిక్కుతోచక వెనక్కిపోయారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించారు.
నీరు తోడారో.. కేసు పెడతా!
ఓ వైసీపీ నాయకుడి బెదిరింపులు
50 ఎకరాల్లో ఎండిపోతున్న వరిపైరు
చెరువు నీటి కోసం రైతుల యత్నం
మోటారు లాగేసిన అధికార పార్టీ నేత
వర్షం కురవలేదు. నోటికాడికి వచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతోంది. ఊరి దగ్గర్లోనే చెరువు ఉంది. దాన్నుంచి నీరు తోడుకోవాలనుకున్నారు. పంటకు ఒక తడైనా ఇవ్వాలనుకున్నారు. చెరువుకు ఇంజన్ బిగించే యత్నం చేశారు. అంతే.. ఓ వైసీపీ నేత అడ్డు తగిలాడు. ‘నీరు తోడారో.. కేసు పెడతా’ అంటూ బెదిరించాడు. దీంతో ఆ రైతులు దిక్కుతోచక వెనక్కిపోయారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించారు.
మెంటాడ, నవంబరు 6: మెంటాడ మండలం పెద చామలాపల్లి గ్రామంలో ముత్యాలనాయుడు చెరువు కింద వేసిన 50 ఎకరాల్లో వరి పైరు ఎండిపోతోంది. వర్షాభావం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పంటను కాపాడుకోవడానికి సోమవారం చెరువు నుంచి ఇంజిన్ ద్వారా నీరు తోడి పంటకు తడి అందిస్తుండగా స్థానిక వైసీపీ నేత అక్కడకు చేరుకున్నాడు. రైతులతో వాగ్వాదానికి దిగాడు. రైతులు ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోలేదు. నీరు తోడితే ఊరుకునేది లేదంటూ హుకుం జారీ చేశాడు. ఈ చెరువును చేపల లీజుకు తీసుకున్నామని, నీరు తోడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ముందుకు వెళ్తే పోలీసు కేసు పెడతానని బెదిరించాడు. చెరువులో తమపార్టీ కార్యకర్త చేప పిల్లలు వేశాడని, నీటిని తోడితే తమ వాళ్లు నష్టపోతాడని వాదించాడు. పంటల కన్నా తమ కార్యకర్త ప్రయోజనమే తనకు ముఖ్యమన్నట్టుగా చెప్పుకొచ్చాడు. కొందరు స్థానికులు కలుగుజేసుకుని చేపపిల్లలను గ్రామంలోని వేరే చెరువులో వేసుకుంటే ఎవరికీ నష్టం ఉండదు కదా? అని మధ్యేమార్గం సూచించగా.. దానికి అయ్యే ఖర్చులు ఎవడు భరిస్తాడని ఎదురు తిరిగాడు. దీంతో రైతులు చేసేది లేక నీటిని తోడుకోవడం నిలిపివేశారు. ఎండిపోతున్న వరి పంటను తలచుకుంటూ ఇంటికి పోయారు. పంటను రక్షించుకోవాలనుకున్న రైతులపై కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని స్థానికులు మండిపడుతున్నారు. కాగా అంతకుముందు వైసీపీ మద్దతుదారులైన కొందరు రైతులు నాలుగు ఇంజన్లతో చెరువు నుంచి నీటిని తోడుకున్నారు. అప్పుడు వారికి ఆ నాయకుడు అడ్డు చెప్పలేదు. ఇదేం న్యాయమని బాధిత రైతులు మండిపడుతున్నారు. ఇదే చెరువులో మరోవైపు ఎర్రమట్టిని వైసీపీ నాయకులు తవ్వుకుని తరలించుకుని పోతున్నారు. అయినా వారిని మాత్రం పట్టించుకోలేదు.
కలెక్టర్‌కు ఫిర్యాదు
సదరు వైసీపీ నేతపై కలెక్టర్‌కు సోమవారం ‘స్పందన’లో రైతులు బాయి భాస్కరరావు, గౌరునాయుడు, ఈశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు తమపై దౌర్జన్యానికి దిగాడని, తమ పంటను నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పంటలకు నీరు తర్వాతే చేపలకు..
పంచాయతీ పరిధిలోని చెరువుల ద్వారా అయకట్టు రైతులకు నీరు అందించాలి. చేపల పెంపకం కోసం వేలం వేసినప్పుడు నిబంధనల్లో ఈ విషయం పొందుపర్చాము. ముందు పంట, ఆ తర్వాత చేపలు పెంపకం. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారే ముందుకు రావాలని చెప్పాము. పెద చామలాపల్లి చెరువు నీటి సమస్యపై ఫిర్యాదు అందలేదు.
- విమలకుమారి, పంచాయతీ విస్తరణాధికారి