స్వార్థ రాజకీయాల కోసమే దాడి

ABN , First Publish Date - 2023-07-21T00:05:25+05:30 IST

స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులు, చట్టాలపై దాడి చేస్తున్నాయని ఏపీ గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.చిన్నంనాయుడు అన్నారు.

స్వార్థ రాజకీయాల కోసమే దాడి
ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు

కురుపాం: స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులు, చట్టాలపై దాడి చేస్తున్నాయని ఏపీ గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.చిన్నంనాయుడు అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న గిరిజన సంఘం 7వ మహాసభలు గురువారం కురుపాంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహాసభ సందర్భంగా రావాడ రోడ్డు కూడలి నుంచి కురుపాం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలకు పాలకవర్గాలు పూర్తిగా రక్షణ లేకుండా చేస్తున్నాయని అన్నారు. ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ వ్యక్తులకు టూరిజం పేరుతో 23 విద్యుత్‌ ప్రాజె క్టులకు అనుమతి ఇచ్చారని ధ్వజమెత్తారు. ఈ కంపెనీల పేరుతో అనుమతులు ఇస్తూ అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు మోదీకి భజన చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ గౌరవ అధ్యక్షులు మండంగి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:05:25+05:30 IST