సర్వేయర్ల మొర
ABN , First Publish Date - 2023-04-03T00:36:03+05:30 IST
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ సర్వేయర్లు కొన్నాళ్లుగా అధికారులకు విన్నపాలు అందజేస్తున్నారు. పనివేళలు.. కనీస సౌకర్యాలపై తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్దిరోజులు క్రితం కలెక్టర్ సూర్యకుమారికి తమ సమస్యను చెప్పుకుందామని వెళ్లి కలెక్టరేట్‌లో సుమారు నాలుగు గంటలు పాటు నిరీక్షించారు. తాజాగా శనివారం జిల్లా అంతటా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మొర పెట్టుకున్నారు.
విధి నిర్వహణలో ఇబ్బందులపై ఆవేదన
అధికారులకు విన్నపాలు
కలెక్టరేట్, ఏప్రిల్ 2: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ సర్వేయర్లు కొన్నాళ్లుగా అధికారులకు విన్నపాలు అందజేస్తున్నారు. పనివేళలు.. కనీస సౌకర్యాలపై తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్దిరోజులు క్రితం కలెక్టర్ సూర్యకుమారికి తమ సమస్యను చెప్పుకుందామని వెళ్లి కలెక్టరేట్‌లో సుమారు నాలుగు గంటలు పాటు నిరీక్షించారు. తాజాగా శనివారం జిల్లా అంతటా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మొర పెట్టుకున్నారు.
ప్రధానంగా ఒక మండలం నుంచి మరో మండలానికి డిప్యూటేషన్ వేసిన సమయంలో టీఏ, డీఏలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 9గంటలు నుంచి సాయంత్రం 5 వరకే పనిచేసేలా అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం కేటాయించిన సెలవు లను కూడా పక్కాగా వినియోగించుకునేలా చూడాలని విన్నవిస్తున్నారు. తాజాగా శనివారం జిల్లా అంతటా సర్వేయర్లు తహసీల్దార్లను కలిసి మరోసారి సమస్యలను వివరించారు. పక్క మండలాలకే డిప్యూటేషన్లు వేయాలని కోరుతున్నారు. జిల్లాలో మొదటివిడతగా 179 గ్రామాల్లో, రెండో విడతగా 61 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ప్రసుత్తం జిల్లాలోని 19 మండలాల్లో 278 గ్రామాల్లో రీసర్వే జరుగుతోంది. సర్వే జరగని మండలాలకు చెందిన సర్వేయర్లను డిప్యూటేషన్‌పై సర్వే జరుగుతున్న మండలాలకు నియమించారు. జిల్లా వ్యాప్తంగా 124 మందిని డిప్యూటేషన్ వేశారు. వీరంతా సొంత సచివాలయాలకు దూరంగా ఉన్న మండలాల్లో పనిచేయడంతో ఆయా తహసీల్దార్లకు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లాలో మొత్తం 530 గ్రామ సచివాయాలు ఉండగా, వాటిల్లో 478 మంది గ్రామ సర్వేయర్లు పని చేస్తున్నారు. ఇంకా 52 గ్రామ సర్వేయర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి గ్రామంలోని ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక రెవెన్యూ కార్యదర్శి కలిసి రోజకు 20 ఎకరాల్లో సర్వే చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇలా సర్వే చేయాలంటే ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ పనిచేయాలి. మరోవైపు గ్రామ కంఠాల సర్వే కూడా జరుగుతోంది. ఈ సర్వే ప్రక్రియ ఈఏడాది అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పరిస్థితిలో రాత్రీపగలు తేడా లేకుండా పని చేయాల్సి వస్తోందని సర్వేయర్లు అవేదన చెందుతున్నారు. పగటి పూట క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కంప్యూటర్‌లో వివరాల నమోదులో నిమగ్నమవుతున్నారు. మరోవైపు డిప్యూటేషన్లు వేస్తుండడంతో ఒత్తిడికి గురి అవుతున్నట్లు వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా సర్వే శాఖ ఏడీ త్రివ్రికమరావు వద్ద ప్రస్తావించగా సర్వేయర్లు చెబుతున్న సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని, వారికి డిప్యూటేషన్లు పక్క మండలాలకు వేసేలా చూస్తామని చెప్పారు.