రాళ్లు పాతారు.. వదిలేశారు

ABN , First Publish Date - 2023-05-27T00:35:02+05:30 IST

ఆ చెరువు గర్భం ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించి రాళ్లు కూడా పాతారు. ఇది జరిగి ఏడాది అయింది. అయినా ఇంతవరకు ఆక్రమణలు తొలగించలేదు. దీనివల్ల అమృత సరోవర్‌ కింద అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుపడడం లేదు. దీనిపై ఇరిగేషన్‌ అధికారులను అడిగితే సర్వే రిపోర్టు లేదని అంటున్నారు. రెవెన్యూ అధి కారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఇదీ గంట్యాడ మండలంలోని నీలకంఠరాజు చెరువు పరిస్థితి.

 రాళ్లు పాతారు.. వదిలేశారు
చెరువు గర్భంలో సాగు చేస్తున్న అరటి తోటలు

గంట్యాడ, మే 26: మండలంలోని మదనాపురం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 5లో 30 ఎకరాల విస్తీర్ణంలో నీలకంఠరాజు చెరువు ఉంది. దీని పరిధిలో వంద ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువును అమృత సరోవర్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు గత ఏడాది జూన్‌లో ఉత్తర్వులు జారీచేసింది. ఈ చెరువు అభివృద్ధి బాధ్యతను ఒక ప్రైవేట్‌ సంస్థకు అప్పగించింది. దీంతో అప్పటి విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్‌ ఈ చెరువును పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. చెరువు గర్భం రెండు ఎకరాలు మినహా మిగిలినదంతా కబ్జా చేసి అరటి, బొబ్బాయి, మామిడి వంటి పంటలను ఆక్రమణ దారులు సాగు చేస్తున్నారు. కొంతమంది షెడ్లు నిర్మించి బోర్లు తవ్వి విద్యుత్‌ లైన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెంటనే దీనిపై సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని మండల రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు అప్పటిలో ఆర్టీవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వేయర్లు, ఇరిగేషన్‌ సిబ్బంది చెరువు వద్దకు వెళ్లి సర్వే చేపట్టారు. ముందుగా చెరువు సరిహద్దులను నిర్ధారించి రాళ్లు పాతిపెట్టారు. తరువాత ఇరిగేషన్‌ అధికారులు చెరువు చుట్టూ జేసీబీతో ట్రెంచ్‌ను తవ్వారు. ఇది జరిగి ఏడాది దాటింది. కానీ, ఇంతవరకూ ఆక్రమణలు తొలగించ లేదు. ఫలితంగా చెరువులో యథావిధిగా పంటలను సాగు చేస్తున్నారు. తమకు చెరువు గర్భం లో పట్టాలు ఇవ్వడంతో 30 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని సంబంధిత రైతులు చెబుతున్నారు. అయితే 30 ఎకరాల విస్తీర్ణం గల నీలకంఠరాజు చెరువును అభివృద్ధి చేస్తే భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని, తక్షణమే ఆక్రమణలు తొల గించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? చూడాలి.

రెవెన్యూ అధికారులకు లేఖ రాశాం

నీలకంఠరాజు చెరువు సర్వే రిపోర్టు కావాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాశాం. గతంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు కలిసి జాయింట్‌ సర్వే చేశారు. కానీ ఆ సర్వే రిపోర్డు లేదు. చెరువు చుట్టూ హద్దులు నిర్ధారించి రాళ్లు పాతిపెట్టాం. ట్రెంచ్‌ కూడా కొట్టించాం. ఆక్రమణలు తొలగించి తప్పకుండా చెరువును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

-వి.తమ్మినాయుడు, జేఈ, ఇరిగేషన్‌, తాటిపూడి.

సర్వే చేసి రాళ్లు పాతిపెట్టాం

నీలకంఠరాజు చెరువుకు సంబంధించి గతంలో ఇరిగేషన్‌ సిబ్బందితో కలిసి సర్వే చేసి హద్దులు నిర్ధారించి రాళ్లు పాతిపెట్టాం. ఈ చెరువుపై పూర్తి హక్కులు ఇరిగేషన్‌ శాఖకే ఉంటాయి.

-ప్రసన్న రాఘవ, తహసీల్దార్‌, గంట్యాడ

Updated Date - 2023-05-27T00:35:02+05:30 IST