ఆసుపత్రుల్లో ఉక్కపోత
ABN , First Publish Date - 2023-05-12T00:20:12+05:30 IST
అనారోగ్యంతో ఆస్పత్రిని ఆశ్రయించే వారికి చికిత్స దేవుడెరుగు.. మౌలిక వసతులు మృగ్యమవుతున్నాయి. ఎండవేడికి కాసేపు కూర్చుని ఉపశమనం పొందాలనుకుంటే ఫ్యాన్ తిరగదు. అసలు విద్యుత్ సరఫరాయే ఉండడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు.
విద్యుత్ అంతరాయంతో నరకయాతన
చాలాచోట్ల పనిచేయని ఫ్యాన్లు
రాత్రిపూట సెల్‌ఫోన్ వెలుగులే గతి
రోగుల సహాయకులకూ ఇబ్బందులు
అనారోగ్యంతో ఆస్పత్రిని ఆశ్రయించే వారికి చికిత్స దేవుడెరుగు.. మౌలిక వసతులు మృగ్యమవుతున్నాయి. ఎండవేడికి కాసేపు కూర్చుని ఉపశమనం పొందాలనుకుంటే ఫ్యాన్ తిరగదు. అసలు విద్యుత్ సరఫరాయే ఉండడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. జనరేటర్లు ఉన్నా కొద్ది సమయమే వేస్తున్నారు. రాత్రిపూట సెల్ వెలుగులే దిక్కవుతున్నాయి. ఇక బంధువులు వస్తే బయట షెల్టర్లు కూడా లేవు. ఎండలో నిరీక్షించాల్సిందే. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ‘ఆంధ్రజ్యోతి’ గురువారం పరిశీలించగా దుర్భరమైన పరిస్థితులు కనిపించాయి. వేసవిలో రోగులకు అందివ్వాల్సిన కనీస సౌకర్యాలపై అధికారుల్లో ముందుచూపు ఏమ్రాతం లేదని తేటతెల్లమవుతోంది.
శిశువుల రోదన.. బాలింతల ఆవేదన
భోగాపురం, మే11: స్థానిక సీహెచ్‌సీలో విద్యుత్ సక్రమంగా ఉండడం లేదు. కరెంటు కోతలతో శిశువులు, బాలింతలు, రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భోగాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గురువారం పరిశీలించగా తిరగని ఫ్యాన్ కింద ఓ బాలింత అవస్థలు పడడం కనిపించింది. తాటాకు విసనకర్రతో శిశువుకు సేదతీరుస్తూ ఉన్న ఆమె అక్కడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సీహెచ్‌సీలో నిరంతరం ప్రసవాలు జరుగుతుంటాయి. కాన్పు అనంతరం శిశువును, బాలింతను సుమారు 6 నుంచి 8 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతారు. అయితే ఆసుపత్రిలో విద్యుత్ సరిగా లేక.. కరెంటు ఉన్నప్పుడు కూడా ఫ్యాన్లు తిరగక నరకయాతన పడుతున్నారు. ఒక్కోసారి ఉక్కబోతకు శిశువులు గగ్గోలు పెడుతుంటారని వారంతా వాపోతున్నారు. అసుపత్రిలోని ఏ బెడ్‌ను చూసినా శిశువులు, బాలింతల వద్ద తాటాకు విసనకర్రతో బంధువులు కనిపించారు. 30 పడకల ఆసుపత్రి అయినా సౌకర్యాలు మాత్రం అంతంతే. ఇక్కడకు ప్రతిరోజూ సుమారు 20 మందికి పైగా రోగులు వస్తుంటారు. రాత్రి పూట కూడా విద్యుత్ సరిగా ఉండదని రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెల్ లైటింగ్‌లో ఉంటుంటామని చెబుతున్నారు. జనరేటర్‌ను రాత్రి సమయంలో గంట కంటే ఎక్కువ సమయం ఆన్‌చేసి ఉంచరని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు ఆరుబయట ఉండాలంటే ఎటువంటి షెడ్లు లేవు. చెట్ల నీడలోనే ఉంటున్నామని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గాలిలేక నరకయాతనగా ఉంది
ఆసుపత్రిలో రెండు రోజులుగా ఉంటున్నాను. రాత్రి సమయంలో కూడా విద్యుత్‌ను నిలిపేస్తున్నారు. సెల్ లైట్లు వేసుకుంటున్నాను. ఫాన్లు తిరగక.. గాలి లేక.. ఎండ వేడికి, రాత్రి సమయంలో ఉక్కపోతకు శిశువు ఉండలేకపోతోంది. విద్యుత్ నిలిపేస్తుండడం దారుణం.
- మైలపల్లి అకిల, బాలింత
అవస్థలు పడుతున్నాం
మా అబ్బాయికి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించాం. నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. సోమవారం నుంచి కరెంటు పది నిమిషాలు ఉంటే మరో మూడు నాలుగు గంటలపాటు నిలిపేస్తున్నారు. మళ్లీ వచ్చినా వెంటనే పోతోంది. ఫాన్లు తిరగక.. గాలి ఆడక ఇబ్బందులు పడుతున్నాం. జనరేటర్ కూడా గంటా.. గడియా మాత్రమే వేస్తున్నారు.
- బమ్మిడి రామలక్ష్మి, భోగాపురం.
వైరింగ్ సక్రమంగా లేకే సమస్య
ఆసుపత్రిలో వైరింగ్ సక్రమంగా లేకపోవడంతో కరెంటు సమస్య ఉంది. బాగు చేయిస్తున్నా మళ్లీ సమస్య వస్తోంది. ఆపరేషన్ సమయంలోనూ రాత్రిసమయంలోనూ జనరేటర్ ఉపయోగిస్తున్నాం. నిరంతరం జనరేటర్ ఉంచాలంటే ఖర్చుతో కూడుకున్నపని. విద్యుత్ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం.
- పి.సునీల్, వైద్యాధికారి, సామాజిక ఆరోగ్య కేంద్రం, భోగాపురం
బొబ్బిలిలో చెట్లు నీడే గతి
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
అది బొబ్బిలి సామాజిక ఆస్పత్రి. మధ్యాహ్నం ఒంటి గంట అయింది. ఎండ తీవ్రంగా ఉంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన ఆ సమయంలో రోగుల బంధువులు ఆస్పత్రి బయట అవస్థలు పడడం కనిపించింది. రోగులకు సహాయకులుగా వచ్చిన వారు చెట్ల నీడన ఉన్నారు. అక్కడ రేకుల షెడ్లు ఉన్నప్పటికీ ఎండ వేడికి వాటిలో కూర్చొనే అవకాశం లేదు. నాలుగు ఫ్యాన్లు ఉన్నా రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక ఫ్యాను మరమ్మతులకు గురై వైర్లు పీకేసి ఉన్నాయి. జనరల్ వార్డును పాత భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ భవనం పాడుబడినట్లు కన్పిస్తోంది. ఓ రోగికి సహాయకురాలిగా వచ్చిన అన్నపూర్ణ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రెండు రోజులుగా తాను ఆసుపత్రిల్లో ఉంటున్నానని, రోగుల వద్ద అనుమతించకపోవడంతో చెట్టు నీడన ఉంటున్నానని చెప్పారు. షెడ్డుకు బదులు పక్కా భవనం నిర్మించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తాగునీరు కొనుక్కోవాల్సిందే!
విజయనగరం (ఆంధ్రజ్యోతి), మే 11 : తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ప్రమాదాల్లో గాయపడ్డవారు జిల్లా కేంద్రాసుపత్రిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక్కడికి ప్రతిరోజూ వందలాది మంది వైద్యం కోసం వస్తారు. వీరితో పాటు, సహాయంగా బంధువులు కూడా వస్తారు. వైద్యం కన్నా అందివ్వాల్సిన తాగునీరు అందుబాటులో లేకపోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదివరకు వాటర్ కూలర్ ద్వారా నీరు నింపుకుని రోగులు తాగేవారు. ప్రస్తుతం కూలర్ పనిచేయపోవడంతో బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు వద్ద మేడపై ఏర్పాటు చేసిన ట్యాంక్ నుంచి తాగునీరు అందిస్తున్నారు. ఆ నీరు చెడువాసన వస్తోందని పలువురు రోగులు వాపోయారు.
- ఐసీయూలో చేరే రోగులకు చల్లటి వాతావరణంతో పాటు ఎలాంటి శబ్దాలు రాకుండా చూడాలి. వైద్యులు, నర్సులు తప్ప ఇతరులను ఐసీయూలోకి రానివ్వకూడదు. కేంద్రాసుపత్రిలో ఆ పరిస్థితి లేదు. తరచూ అనేక మంది వస్తూ వెళ్తున్నారు. ఐసీయూలో 6 ఏసీలు ఉంటే అందులో 4 మాత్రమే పనిచేస్తున్నాయి. రోగులు వేడికి ఇబ్బంది పడుతున్నారు.
వరండాలోనే వైద్యం
నెల్లిమర్ల, మే 11: నెల్లిమర్ల సీహెచ్‌ఎన్‌సీలో వరండాలోనే రోగులకు వైద్యం అందించడం గురువారం కనిపించింది. కొత్త భవనం నిర్మాణంలో ఉండడంతో పక్కనే ఉన్న పాత బిల్డింగ్‌లో ఆస్పత్రిని కొనసాగిస్తున్నారు. ఎండ వేడికి రోగులు ఇబ్బంది పడుతున్నారు. సమయపాలన లేకుండా కరెంటు నిలిపేస్తుండడంతో ఫ్యాన్లు తిరగక విసుగెత్తిపోతున్నారు. ఎక్స్‌రే మిషన్, జనరేటర్ ఉన్నా ఉపయోగంలో లేవు. వాటిని వినియోగించుకునే చొరవ అధికారుల్లో కొరవడింది.