తెలంగాణ ఎంసెట్‌లో శ్రీజ సత్తా
ABN , First Publish Date - 2023-05-26T00:11:32+05:30 IST
తెలంగాణ రాష్ట్రం ఈనెల 14న నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన మీసాల ప్రణతిశ్రీజ విశేష ప్రతిభ కనబరిచారు. ఆ రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.

10వ ర్యాంక్ సాధించిన గుర్ల విద్యార్థిని
విజయనగరం, మే 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఈనెల 14న నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన మీసాల ప్రణతిశ్రీజ విశేష ప్రతిభ కనబరిచారు. ఆ రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. తాజాగా గురువారం ఉదయం విడుదలైన ఫలితాల్లో 10వ ర్యాంకు కైవశం చేసుకోవటంతో ఆమె స్వగ్రామం గుర్లలోని బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి మీసాల అప్పలనాయుడు రైల్వే శాఖలో ఆర్‌పీఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి అన్నపూర్ణ ఉపాధ్యాయురాలిగా జామి మండలం కుమరాంలో పనిచేస్తున్నారు. వీరు విజయనగరం గోపాలనగర్‌లో నివాసం ఉంటున్నారు. సోదరుడు అప్పలననరసింహ శ్రావణ్ చిత్తూరు జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదువుతున్నాడు. ఉత్తమ ర్యాంకు సాధించడంపై శ్రీజ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తెలంగాణ ఎంసెంట్లో తనకు 10వ ర్యాంకు రావడం ఆనందంగా ఉందన్నారు. తాను జేఈఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించానని, ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
ఫొటోరైటప్స్: కుటుంబ సభ్యులతో ప్రణతిశ్రీజ
51 ప్రణతిశ్రీజ
----------
పిడుగుల వాన
గాలుల తీవ్రతకు చెట్టు కూలి మహిళకు గాయాలు
మెంటాడ/ తెర్లాం/ దత్తిరాజేరు, మే 25: జిల్లాలో వేర్వేరు చోట్ల గురువారం పిడుగులు పడ్డాయి. తీవ్ర గాలులతో వర్షం పడింది. వాటి ప్రభావానికి పంటలకు నష్టం వాటిల్లింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మెంటాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పిడుగుపాటుకు జయితి గ్రామంలో ఓ పాడిగేదె మృతి చెందింది. చల్లపేటలో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి, గౌడ వీధుల సమీపంలో గురువారం పిడుగు పడింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఫ్లాట్‌ఫారంపై ఆకస్మికంగా చెట్టు కూలింది. ఆ సమయంలో రైలు దిగి అటుగా వస్తున్న మహిళపై చెట్టు పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. భారీ ఈదురుగాలుల వల్లే ఈ ఘటన సంభవించింది.
25టీఎల్‌ఎం3: గౌడవీధిలో పిడుగుపాటుకు దగ్ధమవుతున్న కొబ్బరిచెట్టు
----------
ట్రైనీ సహాయ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్
కలెక్టరేట్, మే 25: జిల్లాకు శిక్షణ కోసం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్ బి.సహాదిత్ వెంకట్ త్రివినాగ్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో విధుల్లో చేరారు. కలెక్టర్ నాగలక్ష్మిని ఆమె చాంబర్‌లో కలిసి బాధ్యతలు చేపట్టారు. ఈయన 2022 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. హైదరాబాద్ ఐఐటీలో మెటలర్జీ బ్రాంచిలో చదువుకుని 2020లో బీటెక్ పూర్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం, ముంబై తదితర నగరాల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. వెంకట త్రివినాగ్ తండ్రి జయకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదాయపన్ను కమిషనర్‌గా పని చేస్తున్నారు. బ్యాడ్మింటన్, వ్యాయామం అంటే తనకు ఇష్టమని చెప్పారు.
పోటో రైటప్: 25 కలెక్టరేట్ 1 కలెక్టర్‌ను కలిసిన ట్రైనీ కలెక్టర్ త్రివినాగ్
=======