ముందు ముద్రలు.. తర్వాత చెల్లింపులు

ABN , First Publish Date - 2023-08-02T00:33:31+05:30 IST

జిల్లాలోని పలు గ్రామాల పింఛన్‌దారులకు నిరీక్షణ తప్పలేదు. ఈ నెల సామాజిక పింఛన్ల మొత్తాలను సకాలంలో ప్రభుత్వం జమ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

ముందు ముద్రలు..  తర్వాత చెల్లింపులు
పింఛన్ల కోసం మంగళవారం సాయంత్రం వరకు నిరీక్షించిన పింఛన్‌దారులు

ప్రభుత్వం సకాలంలో జమ చేయని వైనం

పింఛన్‌దారులకు తప్పని నిరీక్షణ

( గరుగుబిల్లి )

జిల్లాలోని పలు గ్రామాల పింఛన్‌దారులకు నిరీక్షణ తప్పలేదు. ఈ నెల సామాజిక పింఛన్ల మొత్తాలను సకాలంలో ప్రభుత్వం జమ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లాలో అనేక గ్రామాల్లో వలంటీర్లు పింఛన్‌దారులతో ముందుగా వేలి ముద్రలు వేయించి సాయంత్రం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే ప్రక్రియతో కొంతమంది ఆందోళన చెందారు. సాయంత్రానికి నగదు అందిస్తామని వలంటీర్లు చెప్పడంతో పింఛన్‌దారులు కాస్త శాంతించారు. సామాజిక పింఛన్ల పంపిణీ జాప్యానికి నిధుల సమస్య కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా జిల్లాలోని 350 సచివాలయాల్లో పలు రకాల పింఛన్‌దారులు 1,39,363 మందికి పైగా ఉన్నారు. వారికి ప్రతి నెల రూ. 38,24,25,250 పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. కాగా ప్రతి నెల 31లోగా ప్రభుత్వం 12 విడతలుగా పింఛన్‌ మొత్తాలను జమ చేసేది. దీంతో ప్రతినెలా ఒకటో తేదీన పంపిణీ చేపట్టేవారు. అయితే గత నెలలో 31 వరకు కొంతమేరే ఖాతాల్లో నగదు జమైంది. దీంతో వచ్చిన మేరకు నగదును సచివాలయ సిబ్బంది డ్రా చేశారు. ఆగస్టుకు సంబంధించి ముందస్తుగా 11 విడతల్లో మొత్తాలను ఆయా ఖాతాల్లో జమ చేశారు. 12వ విడత 31వ తేదీకి జమ కాలేదు. దీంతో సచివాలయ సిబ్బంది తలలు పట్టుకున్నారు. 11 విడతల్లో అందిన మొత్తాలను పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 12వ విడత మొత్తం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయ ఖాతాల్లో జమ అయ్యింది. దీంతో సాయంత్రం నుంచి పింఛన్లను పంపిణీ చేశారు.

నూతన పింఛన్‌దారులకు నిరాశే

జిల్లాలో పలు రకాల పింఛన్ల కోసం సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి నిరాశే ఎదురైంది. సుమారు 60 వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. కాగా ఈ నెలలో ప్రభుత్వం వారికి పింఛన్లను మంజూరు చేయలేదు. వాస్తవంగా ఏడాదిలో ఆరు నెలలకు ఒక పర్యాయం పరిశీలన చేసిన సామాజిక పింఛన్లు మంజూరు చే స్తామని గతంలో సర్కారు ప్రకటించింది. అయితే ఈ ధపా ఈ హామీ అమలు కాలేదు. అర్హతలను పరిశీలించిన తర్వాత జూలై నెలలో నూతన పింఛన్‌దారులకు పింఛన్లు అందించాల్సి ఉంది. అయితే దరఖాస్తు చేసుకున్న పింఛన్‌దారులు వివరాలు పరిశీలనకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది.

సమాచారం లేదు

జిల్లా పరిధిలో నూతన పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి సమాచారం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితాను నివేదిస్తాం.

- పి.కిరణ్‌కుమార్‌, పీడీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

=================

ఆదేశాల మేరకే...

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో పింఛన్‌దారులకు ముందస్తుగా వేలిముద్రలు వేయించాం. ముందుగా మంజూరైన పింఛన్‌ మొత్తాలను పంపిణీ చేపట్టాలని సూచించాం. పింఛన్‌దారుల్లో ఆందోళన నెలకొంటుందన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టాం.

జి.పైడితల్లి, ఎంపీడీవో, గరుగుబిల్లి

Updated Date - 2023-08-02T00:33:31+05:30 IST