మీరే చెప్పి.. మీరే ఇలా..

ABN , First Publish Date - 2023-03-26T00:19:27+05:30 IST

‘చిరు ధాన్యాలు మంచి పోషకాలు.. వీటితో తయారు చేసే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం’ అంటూ ప్రతి వేదికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొడుతుంటారు.

మీరే చెప్పి.. మీరే ఇలా..

‘చిరు ధాన్యాలు మంచి పోషకాలు.. వీటితో తయారు చేసే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం’ అంటూ ప్రతి వేదికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొడుతుంటారు. మరి చెప్పేవారు ఆచరించకపోతే.. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇదే దృశ్యం శనివారం కనిపించింది. చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల తినుబండారాలను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు ప్రదర్శించాయి. వేదికపై ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులకు వాటిని స్నాక్స్‌ రూపంలో అందజేశాయి. అయితే సభ చివరి వరకు ఒక్కరు కూడా కనీసం రుచి చూడలేదు. యథాతథంగా వదిలేసి వెళ్లిపోయారు. వాటిని చూసిన మహిళలంతా ఆశ్చర్యపోయారు. చివరికి మరో మహిళ వచ్చి తిరిగి వాటన్నింటినీ సేకరించింది. వేదికపై కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి తదితరులు ఉన్నారు. వేదిక దిగువనున్న వారంతా రాగులతో తయారు చేసిన జావతో పాటు వివిధ రకాల తిను బండారాలను, పిండి వంటకాలను ఆస్వాదిస్తూ తినడం విశేషం.

- (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

------

Updated Date - 2023-03-26T00:19:27+05:30 IST