ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2023-06-03T00:33:47+05:30 IST

నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్‌ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్‌.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.

ఇసుక దోపిడీ
ఎస్‌.కోట: గోస్తనీలో వంతెనకు సమీపంలో ఇసుక తవ్వకాలు

గోస్తనీ తీరంలో చెలరేగుతున్న ఇసుక మాఫియా

అడ్డదిడ్డంగా తవ్వకాలు

ప్రమాదంలో ఊట బావులు

హైకోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్న వ్యక్తులు

నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్‌ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్‌.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.

శృంగవరపుకోట రూరల్‌, జూన్‌ 2 : మామిడిపల్లి, వేములాపల్లి గోస్తనీ తీరంలో ఇసుక మాఫియా చెలరేగుతోంది. ఎంతలా అంటే పోలీసులు కేసులు పెడుతున్నా.. రెవెన్యూ వారు పట్టుకుని హెచ్చరించినా తవ్వకాలు ఆపడం లేదు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా అక్కడ తవ్వకాలు చేపట్టవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాన్ని కూడా ఖాతరు చేయడం లేదు. వేములాపల్లి పంచాయతీ పరిధిలో కొంతమంది వ్యక్తులు గతంలో ఏకంగా గేటు ఏర్పాటుచేసి బండికి రూ.100 వసూలు చేసేవారు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చాక రెవెన్యూ అధికారులు గేటును తొలగించి నదిలోకి దిగకుండా పెద్దకందకం తవ్వించారు. ఇసుక రవాణాలో ఆరితేరిన వ్యక్తులు ఆ కందకాన్ని మూయించి ఏకంగా ట్రాక్టర్లు, నాటుబళ్లు తిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిపోతోంది. మరోవైపు గోస్తనీలో ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో ఎస్‌ఈబీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. మీడియాలో కథనాలు వచ్చినప్పుడే తీవ్రంగా స్పందిస్తున్నారు. తరువాత షరా మాములే.

ప్రణాళికతో తవ్వకాలు

ఇసుక ట్రాక్టర్లు ఉన్న వారు ఐదు నుంచి ఆరు నాటుబళ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేసి వీటి ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక సేకరిస్తున్నారు. సాయంత్రం ట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. తీర గ్రామాల్లో ఏమైనా పండగలు వంటివి జరిగితే కొందరు వ్యక్తులు నాయకుల అవతార ఎత్తి ఒక్కో బండి నుంచి రూ.500 వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారు. గోస్తనీ తీరం నుంచి ఇసుక రవాణా వల్ల తమ పొలాలు దెబ్బతింటున్నాయని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అక్కడ ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించింది. అయినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా తవ్వకాల వల్ల నదిలోని ఊటబావుల్లోకి కలుషిత నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది.

కోర్టు ఆదేశించినా..

వేములాపల్లి,మామిడిపల్లి ప్రాంతంలో వున్న ఊటబావులు, వంతెన, పొలాల వెంబడి ఇసుక ఆక్రమంగా తవ్వేస్తున్నారని కొంతమంది రైతులు హైకోర్టులో ఆరునెలల క్రితం కేసులు వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీస్‌, రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఇవేవీ పట్టించుకోవడం లేదు.

కేసు వేసినందుకు దుబాయ్‌ వెళ్లకుండా చేశారు

మా ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల నదిలోని ఊటబావులు నాశనం అవుతున్నాయని, తాగునీరు కలుషితం అవుతోందని, తవ్వకాలు ఆపాలని సివిల్‌ కోర్టులో కేసు వేశాను. అంతే మరుసటిరోజు నాపై అట్రాసిటీ కేసు పెట్టారు. వెల్డర్‌గా దుబాయ్‌లో పనికోసం బయలుదేరిన సమయంలో పోలీసులు ఫోన్‌ చేసి వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతో నా వీసా, పాస్‌పోర్టు రద్దయింది. అన్యాయంపై ప్రశ్నిస్తే ఏమవుతుందో నా జీవితమే ఓ నిదర్శనం.

- నెక్కల రామసత్యం, గట్రాజు కళ్లాలు, వేములాపల్లి పంచాయతీ

అడ్డుకోకపోతే కష్టమే

మాప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశాం. హైకోర్టులో కేసు కూడా వేశాం. తవ్వకాలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. నదిలో ఇసుక తవ్వకాలను అడ్డుకోకపోతే భవిష్యత్‌ ప్రమాదకరమే.

- చప్పా శ్రీనివాసరావు(రైతు), గట్రాజు కళ్లాలు, వేములాపల్లి

రేగిడిలో ఇష్టారాజ్యం

ఊటబావుల వద్ద తవ్వకాలు

రేగిడి, జూన్‌ 2: బొడ్డవలస, రేగిడి వద్ద నాగావళి నదిలో ఊటబావులకు దగ్గరలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రత్యేకాధికారి పెంటోజీరావు అదుపు చేసేందుకు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. తీరంలో ట్రెంచ్‌లు తవ్విస్తామని చెప్పారు. కానీ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. నాయకుల జోక్యం ఎక్కువగా ఉండడం వల్లే ప్రత్యేకాధికారి ఆదేశాలు చెల్లుబాటు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. పగలు.. రాత్రి తేడా లేకుండా క్వారీలు నడుస్తున్నాయి. ఇటీవల స్థానిక మహిళలు రేగిడి నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొన్నారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట నిద్రలేకుండా చేస్తున్నారని, ఊటబావుల వద్ద క్వారీలు సరికాదని నిలదీశారు. ఈ ఘటన తర్వాత రేగిడి క్వారీ నుంచి రాత్రిపూట ఇసుక ట్రాక్టర్ల రవాణా నెమ్మదించింది కానీ బొడ్డవలస ర్యాంప్‌ ఒక్కసారిగా బిజీ అయిపోయింది. ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏడు మండలాల ప్రజలకు తాగునీరు అందిస్తున్న ఊటబావులు ఉన్నాయి. అయినా లెక్కచేయడం లేదు. మామూలు తీసుకుని కొందరు అధికారులు వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రత్యేకాధికారి పెంటోజిరావును వివరణ కోరగా ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. ఇంకా కొనసాగితే కలెక్టర్‌కు నివేదిస్తానన్నారు. మరోసారి అధికారులందరినీ సమన్వయపరిచి ఇసుక అక్రమ తవ్వకాలు లేకుండా చర్యలు చేపడ్తామన్నారు.

Updated Date - 2023-06-03T00:33:47+05:30 IST