Share News

మంజూరు 311.. పూర్తయినవి 107

ABN , First Publish Date - 2023-11-19T23:35:08+05:30 IST

సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి.. అన్ని రకాల సేవలను అందిస్తున్న ఘనత తమదేనని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

మంజూరు 311.. పూర్తయినవి 107
భామినిలో మధ్యలో నిలిచిపోయిన గ్రామ సచివాలయ భవన నిర్మాణం

సకాలంలో బిల్లులు చెల్లించని సర్కారు

నత్తనడకన పనులు

పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వచ్చేదెప్పుడో?

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి.. అన్ని రకాల సేవలను అందిస్తున్న ఘనత తమదేనని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సచివాలయ వ్యవస్థను అట్టహాసంగా ప్రారంభించిన వైసీపీ సర్కారు.. వాటి భవన నిర్మాణాలు, బిల్లుల చెల్లింపులపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో సచివాలయ భవన నిర్మాణాలను చేపట్టినా.. సకాలంలో బిల్లులు చెల్లించని పరిస్థితి. దీంతో జిల్లాలో అనేక చోట్ల భవనాల పనులు పూర్తికాలేదు. కొన్నిచోట్ల నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయి. ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయమే మిగిలింది. ఈలోగా భవన నిర్మాణాలు ఏ మేరకు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఎన్ని పూర్తయ్యాయంటే..

జిల్లాకు 311 గ్రామ సచివాలయ భవనాలు మంజూరైతే.. అందులో కేవలం 107 భవన నిర్మాణాలే ఇప్పటివరకు పూర్తయ్యాయి. 58 భవనాల పనులను ఇంకా ప్రారంభించలేదు. మిగిలిన భవన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ భవన నిర్మాణాలు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే. బిల్లుల చెల్లింపుల జాప్యంతో అనేకచోట్ల భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మొండి గోడలతో దర్శన మిస్తున్నాయి. మొత్తంగా నాలుగున్నరేళ్లలో కేవలం 107 భవనాలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో వార్డు సచివాలయాలు అత్యధికంగా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నచోట మరికొన్ని వార్డు సచివాయాలు ఉన్నాయి. కాగా ఈ సచివాలయాలకు సొంత భవనాలు ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు కనీసం స్థల సేకరణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో వార్డు సచివాలయాలకు ఎప్పుడు నిధులు మంజూరవుతాయో.. ఎప్పుడు సొంత భవనాలు అందు బాటులోకి వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ సచివాల యాలకు కూడా పక్కా భవనాలు లేవు. చాలాచోట్ల ఇరుకైన అద్దె గదుల్లోనే నిర్వహిస్తున్నారు. మరోవైపు సచివాలయాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో చాలాచోట్ల భవన నిర్మాణాలు ప్రారంభించినా.. సకాలంలో బిల్లులు మంజూరు కాని పరిస్థితి. దీంతో వాటి నిర్మాణాలు మరింత జాప్యమవుతున్నాయన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘ఉపాధి’ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో ప్రజలకు అవసరమైన సీసీ రహదారులు , ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కానీ జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం గ్రామ సచివాయాల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భవన నిర్మాణాల బాధ్యతను స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు, లేక పార్టీ నేతలకు అప్పగించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగున్నర సంవత్సరాలు దాటినప్పటికీ ఆయా నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి.

వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు

జిల్లాలో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఎప్పటికపుడు బిల్లులను చెల్లిస్తున్నాం. భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- కృష్ణాజీ, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖాధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - 2023-11-19T23:35:09+05:30 IST