Share News

సమాయత్తం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:32 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు తరలివెళ్లేందుకు జిల్లా శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20న నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా హాజరై.. విజయవంతం చేయాలని భావిస్తున్నాయి.

సమాయత్తం
విజయనగరంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ జిల్లా నేతలు

అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డు

మండిపడుతున్న నాయకులు

ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేరుకునేందుకు సన్నద్ధం

సభ విజయవంతానికి పిలుపు

పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు తరలివెళ్లేందుకు జిల్లా శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈనెల 20న నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా హాజరై.. విజయవంతం చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజక వర్గాల నుంచి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లనున్నారు. ఇందుకు గాను నియోజకవర్గ ఇన్‌చార్జిలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రేణులు తరలించేందుకు గాను ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం, సభలు నిర్వహించుకున్నా.. నిబంధనల ప్రకారం అద్దె చెల్లించి ఆర్టీసీ బస్సులను పొందే అవకాశం ఉండేదని తెలియజేస్తున్నారు. యువగళం పాదయ్రాత ముగింపు సభకు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా సర్కారు అడ్డుపడుతోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకపోయినా.. ఆగేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెద్దఎత్తున పాదయ్రాత్ర ముగింపు సభకు హాజరవుతామని తెలుగు తమ్ముళ్లు, జనసేన పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.

అశోక్‌ బంగ్లాలో సమావేశం

విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లు, శ్రేణుల తరలింపు అంశాలపై చర్చించారు. ముగింపు సభ విజయవంతానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి డి.సత్య తదితరులు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర , మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:32 AM