జీతం..జాప్యం!

ABN , First Publish Date - 2023-03-31T00:05:24+05:30 IST

విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, మండల విద్యావనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇంతవరకూ అందలేదు. ఏప్రిల్‌ సమీపిస్తున్నా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

జీతం..జాప్యం!

జీతం..జాప్యం!

రెండు నెలలుగా వేతనాలు పెండింగ్‌

ఎదురుచూస్తున్న కేజీబీవీ, ఎమ్మార్సీ సిబ్బంది

గతంలో ఎన్నడూలేదని ఆవేదన

(గరుగుబిల్లి)

విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీ, మండల విద్యావనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు ఇంతవరకూ అందలేదు. ఏప్రిల్‌ సమీపిస్తున్నా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కేజీబీవీల్లో ప్రత్యేకాధికారులు, సీఆర్టీలతో పాటు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పనిచేస్తున్నారు. ఎమ్మార్సీ కార్యాలయాలకు సంబంధించి ఎంఐసిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఆర్‌టిలు, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు, సీఆర్‌పీలు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఏ నెలకు ఆ నెల వేతనాలు సక్రమంగా అందేవి. కానీ గత కొద్దినెలలుగా జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వేతనాల కోసం వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.

ఇదీ పరిస్థితి

జిల్లా వ్యాప్తంగా 14 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, 15 ఎమ్మార్సీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 296 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో అస్కాస్‌కు సంబంధించి మరో 188 మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా కోటి రూపాయల వరకూ జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. కేజీబీవీ పాఠశాలల్లో ప్రత్యేకాధికారిణితో పాటు 8 మంది సిబ్బంది, అకౌంటెంట్‌, ఆరోగ్య సిబ్బంది, వాచ్‌మెన్‌, వంట పనివారు, స్వీపర్లు కలిపి మొత్తం 188 మంది పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎమ్మార్సీ కార్యాలయాలకు సంబంధించి 108 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 484 మందికి పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెల 10 నుంచి 12వ తేదీలోపు జీతాలు విడుదల అయ్యేవి. ప్రస్తుతం ఫిబ్రవరి నెలతో పాటు మార్చి నెలకు సంబంధించి జీతాలు రావాల్సి ఉంది. రెండో నెల సమీపిస్తున్నా జీతాలు రాకపోవడంతో వీరిలో ఆందోళన నెలకొంది. ప్రతి నెల వేతనాలకై టెన్షన్‌ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు వాపోతున్నారు. గతంలో ఏడాదికి బడ్జెట్‌ మంజూరు చేసేవారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ నెలకు సంబంధించి ఆ నెలకు బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. సంబంధిత శాఖల సిబ్బందికి ముందుగా బడ్జెట్‌ ప్రతిపాదనలను సమగ్ర శిక్ష అధికారులు అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయినా విడుదల కాని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదలకు చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

కేజీబీవీ, ఎమ్మార్సీ కేంద్రాలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపించాం. ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటికే పంపించినా ..బడ్జెట్‌ విడుదల కాలేదు. నిధులు మంజూరుకాగానే ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో నిధులు జమచేస్తాం.

- జోగినాయుడు, జిల్లా అకౌంట్‌ అధికారి, సమగ్ర శిక్ష

Updated Date - 2023-03-31T00:05:24+05:30 IST