రేపటిలోగా జీతాలు చెల్లించాల్సిందే..
ABN , First Publish Date - 2023-02-11T00:05:50+05:30 IST
రేపటిలోగా జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్ల వినూత్న నిరసన
పార్వతీపురంటౌన్, ఫిబ్రవరి 10 : రేపటిలోగా జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్ నేతలు హెచ్చరించారు. పదో తేదీ వచ్చినా ఈనెల ఇంకా జీతాలు చెల్లించకపోవడంపై పార్వతీపురంలోని డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఎస్.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ.. అన్ని శాఖల ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించగా, ఇప్పటివరకు ఉపాధ్యాయులకు ఎందుకు వేతనాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఈ సమాజంలో భాగమని, ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? అని అన్నారు. అధికారంలోకి రాక ముందు ముద్దులొలికే మాటలు గుప్పించి.. ఇప్పుడు ఉపాధ్యాయ, ఉద్యోగులపై పిడిగుద్దులా? అని మండిపడ్డారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సర్కారుకు తగిన గుణపాఠం చెప్పడం తప్పదన్నారు.