వాన గుబులు
ABN , First Publish Date - 2023-11-22T00:17:11+05:30 IST
తిండి గింజలైనా దక్కుతాయని ఆశపడిన రైతులు చిరుజల్లులతో కలవరపడుతున్నారు. ఎంత పంట పోతుందోనని టెన్షన్ పడుతున్నారు. జిల్లాలో వరి పంట ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తోంది. కోతలకు కాస్త దగ్గరలో ఉన్న చేలున్నాయి.

వాన గుబులు
చాలాచోట్ల పనలపై వరి పంట
తడి ఆరకపోయినా కుప్పలుగా ఏర్పాటు
కోతలకు వచ్చిన పంటపైనా రైతుల్లో టెన్షన్
విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 21 : తిండి గింజలైనా దక్కుతాయని ఆశపడిన రైతులు చిరుజల్లులతో కలవరపడుతున్నారు. ఎంత పంట పోతుందోనని టెన్షన్ పడుతున్నారు. జిల్లాలో వరి పంట ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తోంది. కోతలకు కాస్త దగ్గరలో ఉన్న చేలున్నాయి. అలాగే పనలపై ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల కుప్పలుగా పెట్టుకున్నారు. ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రస్తుత వర్షాలకు నష్టమేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకోసి పనలను పొలంలోనే ఆరబెట్టిన వారు మరింత భయపడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక అయోమయంలో పడ్డారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. వర్షాలు పడక వేలాది రూపాయలు వెచ్చించి ఇంజన్లతో నీరుపెట్టి పంటను కాపాడుకున్నారు. పొట్టదశలో ఉన్నప్పుడు కూడా మోటార్లుతో నీరు పెట్టారు. చివరికి వచ్చేసరికి ప్రతికూల వాతావరణం నెలకొనడంతో నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2లక్షలకు పైగా విస్తీర్ణంలో ఖరీఫ్‌లో వరి సాగుచేశారు. అయితే వర్షాలు లేక సుమారు 25 వేల ఎకరాల్లో పంట పూర్తిగా పోయింది. ఈ నెల మొదటి వారానికే వరి సాగు కోతకు వచ్చింది. ఇప్పటి వరకు 12 శాతం వరకు కోతలు కోశారు. పలుచోట్ల కోతకోసి కుప్పలు పెట్టుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పంటను కోసేందుకు సన్నద్ధమవుతున్నారు. రెండు రోజులుగా జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. సోమ, మంగళవారాల్లో తేలిక పాటి జల్లులు కురియటంతో పంట కాస్త తడిచింది. విజయనగరం మండలంలోని చింతలవలస, రాకోడు, జొన్నవలస, సారిక, దుప్పాడ తదితర గ్రామాల్లో వరిపంట వెన్నులు నేలకు వాలిపోతున్నాయి. ధైర్యం చేసి కోయలేక రైతులు మీమాంసలో పడ్డారు. తుఫాన్ ముప్పు తొలగిపోతే జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది.