వదలని వాన

ABN , First Publish Date - 2023-03-19T00:02:47+05:30 IST

అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో శనివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు పలు పంటలు దెబ్బతిన్నాయి.

వదలని వాన
పాలకొండలో గాలులకు నేలరాలిన మామిడి కాయలు

ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలు

ఆందోళనలో రైతులు

(పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి)/పార్వతీపురం టౌన్‌/సాలూరు/సాలూరు రూరల్‌/సీతంపేట/గరుగుబిల్లి/పాలకొండ)

అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో శనివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చేతికందొచ్చిన పంటలను నష్టపోవడంతో లబోదిబోమంటున్నారు. కాగా రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఇదే వాతావరణం కొనసాగితే ఉన్న పంటలను కాపాడుకోవడం కష్టమని, పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా కొద్దిరోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లావాసులు ఈ వర్షాలతో కాస్త ఊరట చెందుతున్నారు.

జిల్లాలోని పార్వతీపురం టౌన్‌, సాలూరు, సాలూరు రూరల్‌, పాచిపెంట, మక్కువ, సీతంపేట, సీతానగరం, కొమరాడ, గరుగుబిల్లి, పాలకొండ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం 4 గ ంటల నుంచి 6 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో లోతట్టు ప్రాంతాల వాసులు భయాందోళన చెందారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వానలు కురిస్తే ముంపు సమస్య తప్పదని పార్వతీపురంలో బైపాస్‌ కాలనీ, సౌందర్య ఽథియేటర్‌ రోడ్డు వీధి నివాసితులు వాపోయారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సీతంపేట మన్యంలో జీడి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట దిగుబడి వచ్చిన సమయంలో ఈదురుగాలులతో అకాల వర్షం కురుస్తుండడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. పాలకొండతో పాటు వీరఘట్టం మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా మబ్బు వాతావరణం ఏర్పడి ఈదురుగాలులు వీయడంతో ప్రజలకు నానా అవస్థలు పడ్డారు. పట్టణంలోని హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. మామిడి, జీడిమామిడి, మొక్కజొన్న, అరటి పంటలు నేలమట్టమయ్యాయి. గరుగుబిల్లి మండలంలో అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. కాగా శనివారం కురిసిన వర్షం నువ్వు పంటకు అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. సాలూరు మండలంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మామిడిపల్లిలో శివాలయం సమీపంలో మురుగుకాలువ నీరు ఉప్పొంగి రోడ్డుపైకి చేరింది. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు రాకపోకలు సాగించలేకపోయారు. సీతానగరం మండలంలో రైతులు ధాన్యం నిల్వలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల మొక్కజొన్న తడిచిపోయింది. బలిజిపేట మండలం నారాయణపురంలో సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బత్నిట్లు రైతులు చెబుతున్నారు. ఇలాగే వర్షాలు కొనసాగితే నువ్వు పంటకు కూడా నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశారు. వర్షాల వల్ల కలిగే నష్టాలు ,సహాయక చర్యలకు జిల్లావాసులు ఎవరైనా కంట్రోల్‌ రూం 08963-293046 నెంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సూచించారు. రెవెన్యూ ,పోలీసు తదితర శాఖల అధికారులు,సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

Updated Date - 2023-03-19T00:02:47+05:30 IST