Share News

సమ్మెకు సై!

ABN , First Publish Date - 2023-11-22T00:11:07+05:30 IST

జిల్లాలోఅంగన్‌వాడీ సిబ్బంది పోరుబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్న వారు ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందించారు.

 సమ్మెకు సై!
కురుపాం: ఐసీడీఏస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో సిబ్బందికి సమ్మె నోటీసు ఇస్తున్న అంగన్‌వాడీలు

ఆ శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు అందజేత

వచ్చేనెలా 8 లోగా సర్కారు స్పందించాలని డిమాండ్‌

పార్వతీపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోఅంగన్‌వాడీ సిబ్బంది పోరుబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్న వారు ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులు అందించారు. జిల్లాలో ప్రధాన కేంద్రాల్లో అంగన్‌వాడీలు 1412 మంది ఉండగా హెల్పర్లు 1392 మంది ఉన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 623 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 3,427 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను వచ్చేనెల ఎనిమిదో తేదీ లోపు నెరవేర్చకుంటే సమ్మె తప్పదని అంగన్‌వాడీ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు.

డిమాండ్లు ఇవే...

జిల్లాలో అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారానికి గతంలో ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా సర్కారు స్పందించ లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లాలని తీర్మానించుకున్నారు. అవి ఏమిటంటే.. ‘అంగన్‌వాడీలకు తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీని అమలు చేయాలి. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. మినీవర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్చీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి.’ అని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సర్కారు స్పందించాలి

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫలితం లేదు. డిసెంబరు 8లోపు సర్కారు స్పందించాలి. లేకుంటే సమ్మెకు వెళ్తాం.

- జ్యోతి, ప్రధాన కార్యదర్శి, జిల్లా అంగన్‌వాడీ సిబ్బంది సంఘం, పార్వతీపురం మన్యం

Updated Date - 2023-11-22T00:11:08+05:30 IST