నిరసనలు.. నిర్బంధాలు

ABN , First Publish Date - 2023-09-22T23:49:50+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర, సాలూరులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

నిరసనలు.. నిర్బంధాలు
సీతానగరం హనుమాన్‌ జంక్షన్‌లో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నేతలు

కొన్నిచోట్ల నేతల హౌస్‌ అరెస్ట్‌లు

అయినా వెనక్కి తగ్గని తమ్ముళ్లు

చంద్రబాబును విడుదల చేయాలని ఆందోళనలు

పార్వతీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర, సాలూరులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన సింహాచలం వరకు చేపట్టాలనుకున్న పాదయాత్రకు ‘మన్యం’ జిల్లా టీడీపీ నేతలు బయల్దేరనున్నారనే సమాచారంతో ముందస్తుగా వారిని పోలీసులు కొన్ని గంటల పాటు గృహ నిర్బంధం చేశారు. కాగా మధ్యాహ్నం నుంచి పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి విజయచంద్ర పార్వతీపురం మండలం బాలగొడబలో శ్రేణులతో కలిసి రిలే దీక్ష చేపట్టారు. పార్వతీపురం మండలం చిన్నబొండపల్లిలో టీడీపీ మహిళా నేతలు ర్యాలీ చేశారు. అనంతరం వినాయకుడి మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు సురక్షితంగా బయటకు రావాలని వేడుకున్నారు. కురుపాంలో నియోజకవర్గం ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో హరిజన విభాగం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం వద్ద పోలీసులకు మహిళా నేతలు పూలు ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీసులు ధర్మాన్ని కాపాడాలని కోరారు. భామినిలో పాలకొండల నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. సీతానగరం హనుమాన్‌ జంక్షన్‌లో హైవే వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పనున్నారని వారు తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు.

బొబ్బిలి తరలిన నాయకులు

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బొబ్బిలి తరలివెళ్లారు. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ నాయకులు మజ్జి కృష్ణమోహన్‌, వెంకటేష్‌, సీతారాం, బోనుదేవి, చంద్రమౌళి, జి.వెంకటనాయుడు, సత్యనారాయణ తదితరులు బేబీనాయనను కలిసి సంఘీభావం తెలిపారు.

పాదయాత్రా చేయనివ్వరా?

బొబ్బిలి: చంద్రబాబునాయుడు క్షేమాన్ని కోరుతూ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి పాదయా త్రగా బయలుదేరిన టీడీపీ నియోకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బేబీనాయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా శ్రేణులు అడ్డుపడ్డారు. పట్టణమంతా పోలీసు బలగాలు చేరుకొని ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ఒకానొక దశలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఈ సమయంలో బుదరాయవలస పోలీసు స్టేషన్‌లో ఉన్న బేబీనాయన వాట్సాప్‌లో వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశించిన దాని ప్రకారం ఏ ఒక్కరూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా , క్రమశిక్షణగా ఉండాలని హితవు పలికారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం బేబీనాయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు విడిడిపెట్టారు.

Updated Date - 2023-09-22T23:49:50+05:30 IST