హామీలు నెరవేర్చాల్సిందే..
ABN , Publish Date - Dec 31 , 2023 | 11:09 PM
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా వారు ఆటపాటలతో నిరసన తెలిపారు.
20వ రోజుకు చేరిన సమ్మె
సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
బెలగాం/సాలూరు/పాలకొండ/కురుపాం, డిసెంబరు 31: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. జిల్లాలో అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా వారు ఆటపాటలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని నినాదాలు చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు స్కిప్పింగ్, బంతితో ఆటలాడుతూ నిరసన తెలిపారు. అనంతరం సర్కారుకు వ్యతిరేకంగా ఆలపించారు. చిరుద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందారు. రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నా.. సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచాలని, కేంద్రాల అద్దెలు చెల్లించాలని, పని భారం తగించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని అంగన్‌వాడీల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక సాలూరు జాతీయ రహదారిపై ఖోఖో, కబడ్డీ ఆడి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను సర్కారు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అంగన్‌వాడీల దీక్షా శిభిరం వద్దకు ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చేరుకుని వారితో మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలపై త్వరలో ప్రభుత్వం స్పందించనుందని తెలిపారు. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద రంగుల ముగ్గులు వేసి, ఆటపాటలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కురుపాంలోనూ అంగన్‌వాడీలు ఆటపాటలు, నృత్యాలతో నిరసన తెలిపారు. గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో కోలాటంతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారికి ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.