సినిమాల్లో చేరాలని కుమార్తెపై ఒత్తిడి

ABN , First Publish Date - 2023-06-03T00:00:44+05:30 IST

కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లే ఓ బాలిక పట్ల తీవ్ర అభ్యంతర కరంగా వ్యహరించిన ఘటనిది.

సినిమాల్లో చేరాలని కుమార్తెపై ఒత్తిడి

విజయనగరం(ఆంధ్రజ్యోతి),జూన్‌ 2 : కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లే ఓ బాలిక పట్ల తీవ్ర అభ్యంతర కరంగా వ్యహరించిన ఘటనిది. సినిమాల్లోకి వెళ్లాలని, డబ్బులు సంపాదించాలని ఒత్తిడి చేస్తోండడంతో ఆమె విసిగిపోయింది. తాను చదువుకుంటానని ఎంతగా చెబుతున్నా వినకపోవడంతో ఆ బాలిక అధికారులకు తన బాధను ఫోన్‌లో విన్నవించుకుంది. స్పందించిన చైల్డ్‌లైన్‌ సంస్థ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుంది. ఈ ఘటన విజయనగరంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల ఓ మైనర్‌ బాలికను సినిమాల్లో చేరాలని తల్లి కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. కుమార్తెకు ఇష్టంలేకపోయినా చేయాల్సిందేనని చెబుతూ వస్తోంది. విసిగిపోయిన బాలిక చైల్డ్‌లైన్‌ సంస్థను ఆశ్రయించింది. సీడబ్యూసీ (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) చొరవతో విశాఖలోని స్టేట్‌హోంకు తరలించారు. విజయనగరంలోని ఆమె ఇంటికి వెళ్లి బాలికను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ఇదే విషయమై సీడ్యూసీ చైర్మన్‌ హిమబిందు మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, తల్లిని కూడా విచారించి, నిజనిర్దారణ జరిగాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2023-06-03T00:00:48+05:30 IST