గణతంత్ర వేడుకలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-01-26T00:34:44+05:30 IST

జిల్లా ఏర్పడిన తరువాత పార్వతీపురంలోమొదటిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.

గణతంత్ర వేడుకలకు సిద్ధం
రిపబ్లిక్‌ డే ఏర్పాట్లను పరిశీలిస్తున్న జేసీ, ఏఎస్పీ

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

పార్వతీపురంటౌన్‌/ పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడిన తరువాత పార్వతీపురంలోమొదటిసారిగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌, ఏఎస్పీ దిలీప్‌ కిరణ్‌ పరిశీలించారు. సభాస్థలి, వీఐపీలు ఉండే స్థలం, స్టాల్స్‌, శకటాల ప్రదర్శన తదితర విషయాలపై ఆరా తీశారు. గణతంత్ర దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. జెండా వందనం నుంచి స్టాల్స్‌ సందర్శన వరకు అంతా ప్రణాళిక ప్రకారం జరగాలని అధికారులను ఆదేశించారు. గౌరవ అతిఽథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అనంతరం ఏఆర్‌, ఫారెస్టు పోలీసులు, ఎన్‌సీసీ కేడెట్లు చేపట్టిన మాక్‌డ్రిల్‌ అందర్నీ ఆకట్టుకుంది.

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. పోలీస్‌ దళాల వందనాన్ని స్వీకరిస్తారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శకటాలు, ప్రదర్శన శాలలతో ఆయా శాఖల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. సీఆర్‌పీఎఫ్‌ దళాల ఆయుధ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆ తర్వాత కలెక్టర్‌ జిల్లా ప్రగతిపై ప్రసంగించనున్నారు. గణతంత్ర వేడుకలకు ప్రజలు హాజరు కావాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన 277 మంది అధికారులు , సిబ్బందికి కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించనున్నారు.

Updated Date - 2023-01-26T00:34:44+05:30 IST