విన్నపాలు వినవలె..
ABN , First Publish Date - 2023-11-06T23:46:49+05:30 IST
జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ప్రమాద బీమా, సర్వే, ఇంటి పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలపై అత్యధికులు అర్జీలు ఇచ్చారు.
పార్వతీపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ప్రమాద బీమా, సర్వే, ఇంటి పట్టాలు, పింఛన్లు తదితర సమస్యలపై అత్యధికులు అర్జీలు ఇచ్చారు. వాటిని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో జె.వెంకటరావు తదితరులు స్వీకరించారు. వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులు పంపించారు. ఏ కారణం చేత పరిష్కారం కాలేదో అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. మొత్తంగా 120 వినతులు రాగా.. వాటిల్లో కొన్ని ఇలా.. డీఆర్‌పీఏ ద్వారా రుణాలు మంజూరు చేయాలని పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి బంటు శ్రీరాం, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని సాలూరు మండలం మామిడిపల్లి గ్రామవాసి తాడితూరి చిన్నమ్మలు అర్జీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్కరించాలని, 8 ఎకరాల శ్మశానానికి రక్షణ గోడ నిర్మించాలని భామిని మండల నివాసి లోపింటి కాంతారావు , భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సాలూరు మండలానికి చెందిన నయన హరిరెడ్డి వినతిపత్రం అందించారు. భర్త చనిపోయి చాలాకాలమైనా ఇప్పటివరకు పింఛన్ రాలేదని వీరఘట్టానికి చెందిన బండి సంగీత తెలిపింది. బోదకాలితో కొన్నాళ్లుగా బాధపడుతున్న తనకు రూ.5వేల పింఛన్ మంజూరు చేయాలని పార్వతీపురంలోని జగన్నాథపురానికి చెందిన కోట సాయిగణేష్ ‘స్పందన’లో అధికారులను వేడుకున్నాడు.
కరువు జిల్లాగా ప్రకటించండి..
కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం, సీపీఐ, రైతు కూలి, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం అక్కడ నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావును కలిసి వినతిపత్రం అందించారు. వర్షాభావం, ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో సాగునీరు అందని కారణంగా జిల్లాలోని 15 మండలాల్లో పూర్తిగా వరి పంట ఎండిపోయిందన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో జిల్లాకు చెందిన ఒక మండలం కూడా లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారితో పాటు కురుపాం మండల నివాసి గరుగుబిల్లి సూరయ్య తదితరులు కోరారు. జిల్లాలోని పంటల పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.