ఓపీఎస్ అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-09-22T23:44:50+05:30 IST
జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం)ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు.
పార్వతీపురం టౌన్, సెప్టెంబరు 22 : జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం)ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ తెలిపారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జీపు జాత శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శులు బి. లక్ష్మీరాజు, ఎస్. మురళీమోహన్ తదితరులు జాతకు ఘన స్వాగతం పలికారు. తొలుత వారంతా పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్ నాలుగేళ్లు గడిచినా హామీని నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఓపీఎస్‌కు బదులు జీపీఎస్ అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం.. ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని అన్నారు. పాత పెన్షన్ స్కీం మినహా సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం పునరాలోచించి పాత పెన్షన్ స్కీం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యారంగం పరిరక్షణ కోసం యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. సంఘం స్వర్ణోత్సవాల్లో భాగంగా వచ్చేనెల ఒకటో తేదీన విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.