సాగుతూ... ఆగుతూ
ABN , First Publish Date - 2023-09-04T00:50:21+05:30 IST
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాజాం ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన అదనపు భవన నిర్మాణం, మరమ్మతుల పనులు తీవ్ర జాప్యంతో జరుగుతున్నాయి. నిర్మాణానికి నాబార్డు నిధులు రూ.6.8కోట్లు మంజూరయ్యాయి.
సాగుతూ... ఆగుతూ
ఏరియా ఆసుపత్రి అదనపు భవన నిర్మాణంలో జాప్యం
ఈఈ ఆదేశాలు బేఖాతరు
50 శాతం పనులే పూర్తి
మూడేళ్లుగా కొనసాగుతున్న పనులు
రాజాం, సెప్టెంబరు 3: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాజాం ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన అదనపు భవన నిర్మాణం, మరమ్మతుల పనులు తీవ్ర జాప్యంతో జరుగుతున్నాయి. నిర్మాణానికి నాబార్డు నిధులు రూ.6.8కోట్లు మంజూరయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థకు అప్పట్లో నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. పనులు ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్నా ఇంకా ఆలస్యంగానే సాగుతున్నాయి. పాడైన పిల్లర్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించడం లేదు. వైద్యులకు అనుకూలంగా గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వార్డుల్లోని స్నానపుగదులకు మరమ్మతులు చేయడం లేదు. వార్డులు తక్కువగా ఉండడంతో వచ్చిన రోగులను ఇరుకు వార్డుల్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఫ ఆసుపత్రికి సుమారు ఏడు మండలాల నుంచి రోజుకు 100 నుంచి 120 మందివరకు రోగులు వస్తుంటారు 30 నుంచి 40 వరకు ఇన్‌పేసెంట్లు కూడా ఉంటారు. ఎక్కువగా పాముకాటు, కుక్కకాటు, ప్రమాదాల్లో గాయపడిన వారు, గర్భిణులు, ఇతర రోగులు వస్తుంటారు.
ఈఈ ఆదేశాలు బేఖాతరు
ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి మూడు వారాల కిందట జిల్లా నాబార్డు ఈఈ శ్యామ్ ప్రభాకర్ వచ్చారు. పనుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్, సిబ్బందిపై మండిపడ్డారు. పనులు సకాలంలో పూర్తిచేయకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించినా పనుల్లో పురోగతి లేదు. గర్భిణుల వార్డులో బాత్‌రూమ్ తలుపులు ఊడిపోయాయని, కొన్ని అత్యవసర పనులు పూర్తిచేయడం లేదని సిబ్బంది ఆయనకు ఫిర్యాదు చేశారు. మూడు వారాలైనా గర్భిణుల బాత్‌రూమ్‌లు అలాగే ఉన్నాయి.
ఫ ఆసుపత్రి అదనపు భవన నిర్మాణం 2020నవంబరులో ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. గచ్చులు, పెయింటింగ్ పనులు పూర్తిచేయాల్సి ఉంది.
ఫ సామాజిక ఆసుపత్రిలో జరుగుతున్న పనులను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో కాంట్రాక్టరు ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించాం
శ్యమ్‌ప్రభాకర్, నాబార్డు ఈఈ
ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. డిశంబరు నెలాఖరుకు పనులు మొత్తం పూర్తిచేసి ఇవ్వాలని ఆదేశించాం. ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరిగినా చర్యలు తప్పవు. గర్భిణుల బాత్‌రూమ్‌ల పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. తాను స్వయంగా మళ్లీ పరిశీలిస్తాను.
పనుల్లో తీవ్ర జాప్యం
రాజ్యలక్ష్మీ, ఆసుపత్రి సూపరింటెండెంట్, రాజాం
ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. అయినా స్పందన కనిపించలేదు. ఈఈ పర్యవేక్షించినపుడు కూడా కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. సకాలంలో పూర్తిచేయకపోతే కాంట్రాక్టును కూడా రద్దు చేస్తామన్నారు. అయినా వారిలో చలనం కనిపించలేదు ఇంతవరకు 50 శాతం మాత్రమే పూర్తి చేశారు.