ఓం నమశ్శివాయ
ABN , First Publish Date - 2023-11-21T00:05:37+05:30 IST
ఓ నమశ్శివాయ నామంతో శివాలయాలు మోరుమోగాయి. లింగార్చనలు.. అభిషేకాలు.. దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు.

ఓం నమశ్శివాయ
కార్తీక తొలి సోమవారం కిటకిటలాడిన శివాలయాలు
విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 20: ఓ నమశ్శివాయ నామంతో శివాలయాలు మోరుమోగాయి. లింగార్చనలు.. అభిషేకాలు.. దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి సోమవారం కావడంతో మరింత భక్తిప్రపత్తులను చాటారు. తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 11 గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ శివాలయాల వద్ద భక్తులు బారులుతీరడం కనిపించింది. సాయంత్రం ఉపవాస దీక్ష ముగించుకున్న మహిళలు ఆలయాల ధ్వజస్తంభాల వద్ద కార్తీకదీపాలు వెలిగించారు. విజయనగరంలోని వీరరాజేశ్వర స్వామి ఆలయం, శివాలయం వీధిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్త ఆగ్రహారంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం రోజంతా భక్తులతో కిటకిటలాడాయి. రామతీర్థం, పుణ్యగిరి, జయతిలోని పురాతన ఆలయం, నెల్లిమర్లలోని సారిపల్లి వద్ద వున్న పురాతన దిబ్బేశ్వర స్వామి ఆలయం, గజపతినగరం మండలం గంగచోళ్లపెంట పురాతన శివాలయాల్లో పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాగర, నదీ తీరాల్లో కార్తీక స్నానాలు ఆచరించారు. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.