అధికారులు ఇలా.. మిల్లర్లు అలా

ABN , First Publish Date - 2023-01-19T23:57:08+05:30 IST

ఇలా అధికారులు, మిల్లర్లు చెబుతున్న మాటలతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో నూర్పులు చేయలేదు. కల్లాల్లో వరి కుప్పలతో పాటు ధాన్యం నిల్వలు ఉండిపోయాయి.

అధికారులు ఇలా.. మిల్లర్లు అలా
జామి మండలం తాండ్రంగిలో కల్లాల్లో ధాన్యం

అధికారులు ఇలా.. మిల్లర్లు అలా

జిల్లాలో పునఃప్రారంభం కాని ధాన్యం కొనుగోళ్లు

ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడమే కారణం

బ్యాంక్‌ గ్యారెంటీలు లేవంటున్న మిల్లు యాజమానులు

ఇప్పటివరకూ కొనుగోలు చేసింది 2.6 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇంకా రైతుల వద్ద 1.9 లక్షల మెట్రిక్‌ టన్నులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

‘జిల్లాలో దాదాపు ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయ్యింది. సంక్రాంతికి ముందే కొనుగోళ్లు పూర్తిచేయగలిగాం. ఇక అరకొరగానే కొనుగోళ్లు మిగిలాయి’..ఇది అధికారులు దిగువస్థాయికి పంపుతున్న సందేశాలు.

‘ప్రభుత్వం తమకు అప్పగించిన కొనుగోళ్లు పూర్తిచేశాం. బ్యాంక్‌ గ్యారెంటీ ప్రాప్తికి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి, బ్యాంక్‌ గ్యారెంటీ చెల్లించి మిగతా ధాన్యం కొనుగోలు చేస్తాం’..ఇదీ మిల్లర్లు చెబుతున్న మాట.

- ఇలా అధికారులు, మిల్లర్లు చెబుతున్న మాటలతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో నూర్పులు చేయలేదు. కల్లాల్లో వరి కుప్పలతో పాటు ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. అధికారులు మాత్రం లక్ష్యం పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అటు మిల్లర్లు సైతం ధాన్యాన్ని తిప్పి పంపుతున్నారు. దీంతో రైతులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఈ ఖరీఫ్‌లో 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ 2.6 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 1.9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సంక్రాంతి అనంతరం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కానీ మిల్లర్లు మాత్రం తమ బ్యాంక్‌ గ్యారంటీ పూర్తయిందని.. కొనుగోలు నిలిపివేశామని చెబుతున్నారు. ప్రధానంగా గంట్యాడ, జామి, డెంకాడ, గజపతినగరం, బొబ్బిలి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిల్లులు గత ఐదు రోజులుగా నిలిచిపోయాయి. గురువారం నుంచే తెరుచుకున్నాయి. బ్యాంక్‌ గ్యారెంటీ ఉన్న మిల్లర్లు మాత్రం వారి పరిధిలోని ఆర్‌బీకేల ద్వారా ట్రక్‌ షీట్లు కొట్టించి కొనుగోళ్లను పునఃప్రారంభించారు. అటు చెల్లింపులు ప్రక్రియ ఊపందుకోలేదు. ఇంకా రూ.10 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ మూడు విడతలుగా చెల్లింపులు చేశారు. గత నెల 25 వరకూ ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు చెల్లింపులు చేసినట్లు సమాచారం. ఈ నెల 9న చివరి విడతలో చెల్లింపులు చేశారు.

దళారులకు చాన్స్‌..

లక్ష్యం మేరకు రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు పూర్తిచేస్తే పర్వాలేదు. లేకుంటే అటు దళారులు రంగప్రవేశం చేసి ఇష్టానుసారంగా ధర నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి దశలవారీగా వచ్చిన అనుమతుల మేరకు పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్థేశించిన 2.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం వల్లే అటు అధికారులు, ఇటు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఏ కల్లం చూసినా ధాన్యం రాశులు, బస్తాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆ ప్రభావం నూర్పులపై పడుతోంది. ఇంకా పొలాలు, కల్లాల్లో వరి కుప్పలు కనిపిస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి వీలైనంత త్వరగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

అనుమతి వచ్చిన వెంటనే..

జిల్లాలో ఇప్పటివరకూ 2.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతులకు రూ.480 కోట్లు చెల్లించాం. మూడు వారాల్లోపే చెల్లింపులకు ప్రయత్నించాం. ఇంకా కొద్ది మొత్తమే పెండింగ్‌లో ఉంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు, మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించిన వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తాం.

- మీనాకుమారి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌, విజయనగరం

Updated Date - 2023-01-19T23:57:10+05:30 IST