Share News

ఇల్లు లేదు.. డబ్బూ లేదు..

ABN , First Publish Date - 2023-11-22T00:12:41+05:30 IST

ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా.. కనీసం వారు కట్టిన డబ్బులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇల్లు లేదు.. డబ్బూ లేదు..
చంద్రంపేట సమీపంలో టిడ్కో ఇళ్ల సముదాయం

రివర్స్‌ టెండరింగ్‌తో కొంతమందికి మొండిచేయి

అటువంటి వారికి ఇప్పటికీ నగదు చెల్లించని వైనం

మరోవైపు జాబితాలో ఉన్న వారికి గృహాలు అందించని సర్కారు

నేటికీ తుది దశకు చేరుకోని పనులు

ఎప్పటి కి పూర్తవుతాయో.. ఇంకెప్పటికి అందిస్తారో తెలియని పరిస్థితి

ఎదురుచూపుల్లో లబ్ధిదారులు

(సాలూరు)

- సాలూరులోని బంగారమ్మకాలనీలో నివాసం ఉంటోంది పేరు కరణం నారాయణమ్మ. గత టీడీపీ ప్రభుత్వం ఆమెకు టిడ్కో ఇల్లు మంజూరు చేసింది. దీంతో నారాయణమ్మ నుంచి డీడీ రూపంలో అధికారులు రూ.25 వేలు తీసుకున్నారు. అయితే ఇంతవరకు ఆమెకు ఇల్లు ఇవ్వలేదు.. కట్టిన డబ్బులూ ఇవ్వలేదు. చంద్రబాబు మంజూరు చేసిన టిడ్కో ఇంటిని ఎందుకు ఇవ్వరు అంటూ ఈ ఏడాది అక్టోబరు 15న మున్సిపల్‌ అధికారులను ఆమె ప్రశ్నించింది. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు.

- వృత్తిరీత్యా బైక్‌ మెకానిక్‌ అబ్దుల్‌ హాక్‌. సాలూరులో నివాసం ఉంటున్న ఆయనకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో భవన సముదాయంలో సీ-1 బ్లాక్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో ఎఫ్‌-8 ప్లాట్‌ మంజూరు చేసింది. ఇందుకు గాను ఆయన డీడీ రూపంలో రూ. 25 వేలు కట్టారు. ఇల్లు మంజూరైనట్లు అధికారులు ఆయనకు ధ్రువపత్రం కూడా ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో నిరాశే ఎదురైంది. ఆయనకు ఇప్పటివరకు ఇల్లు ఇవ్వలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదు. జగనన్న లే అవుట్‌లో కూడా స్థలం కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఆయన అప్పులకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.

ఇలా వారిద్దరే కాదు.. పట్టణంలో ఎంతోమంది లబ్ధిదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా.. కనీసం వారు కట్టిన డబ్బులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు లేక.. అప్పులకు వడ్డీలు చెల్లించుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పేదల సొంతిటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం 2018లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా సాలూరు మున్సిపాల్టీ పరిధిలో సుమారు 1,444 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికోసం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న చంద్రంపేట సమీపంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ ఇళ్లకు సంబంధించి చదరపు అడుగుల విస్తీర్ణం బట్టీ లబ్ధిదారులు రూ.500, రూ.12,500, రూ.25,000, రూ.37,500 చొప్పున డీడీల రూపంలో మున్సిపల్‌ కార్యాలయానికి చెల్లించారు. అయితే ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. వైసీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఎంతోమంది అర్హులు ఇళ్లు కోల్పోయారు. ఇటువంటి వారికి ఇంతవరకు డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదు.

1,248 ఇళ్లు మాత్రమే ...

వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో ఇళ్ల సంఖ్యను తగ్గించింది. గతంలో 1,444 ఇళ్లను కాస్త 1,248 ఇళ్లుగా కుదించారు. వాటిల్లో రూ.500 డీడీ రూపంలో చెల్లించిన 300 చదరపు అడుగులకు సంబందించినవి 1152 కాగా, 365 చదరపు అడుగులకు సంబంధించిన ఇళ్లు 96 మాత్రమే. కాగా రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో ఎంతోమంది ఇళ్లను కోల్పోయారు. ఇటువంటి వారికి రూ.56 లక్షల 80 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఆ మొత్తం ప్రభుత్వం అందించడం లేదు. మరోవైపు ఇళ్లు మంజూరు చేయడం లేదు. కనీసం జగనన్న కాలనీల్లో అయినా పట్టాలు ఇవ్వకపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు.

నత్తనడకన పనులు

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఆశించిన విధంగా జరగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తుది దశకు చేరుకోవడం లేదు. ఇప్పటికీ మౌలిక వసతుల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల నిర్మాణాలు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో ఆ పనులు ఎప్పటికి కొలిక్కి వస్తాయి.. ఇంకెప్పటికీ లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా డీడీల రూపంలో రూ.500, రూ.25 వేలు, రూ.37,500 చొప్పున చెల్లించిన వారంతా టిడ్కో ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

డబ్బులు వచ్చిన వెంటనే జమచేస్తాం

రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా లబ్ధిదారులు టిడ్కో ఇళ్లు కోల్పోయిన మాట వాస్తవమే. లబ్ధిదారులకు సుమారు రూ.56 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేస్తాం. రూ.500 డీడీ రూపంలో చెల్లించిన వారికి సైతం ఒక రూపాయి ప్రభుత్వ ఖాతాలో ఉంచుకొని మిగతా మొత్తం చెల్లిస్తాం.

- జయరాం, కమిషనర్‌, సాలూరు మున్సిపాల్టీ

Updated Date - 2023-11-22T00:13:09+05:30 IST