నిరనన హోరు

ABN , First Publish Date - 2023-08-02T00:34:50+05:30 IST

జిల్లాలో మున్సిపల్‌ కార్మికులు కదంతొక్కారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

నిరనన హోరు
మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

కార్యాలయాల ముట్టడి

పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తం

ఉన్నతాధికారుల హామీతో శాంతించిన వైనం

పార్వతీపురం టౌన్‌/సాలూరు/పాలకొండ, ఆగస్టు1 : జిల్లాలో మున్సిపల్‌ కార్మికులు కదంతొక్కారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం, సాలూరు మున్సిపల్‌ కార్యాలయాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 9 గంటల నుంచే మున్సిపల్‌ కార్యాలయ ప్రధాన ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చాలని, మున్సిపల్‌ ఆప్కాస్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పదవీ విరమణ వయసు పెంచాలని కోరారు.

- నిరసనలో భాగంగా పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయంలోని వెళ్తున్న కమిషనర్‌ జె. రామ అప్పలనాయుడుతోపాటు ఉద్యోగులను కార్మికులు అడ్డుకున్నారు. పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కార్మికులను హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి వెళ్లేదే లేదని పట్టణ ఎస్‌ఐలు దినకర్‌, నారాయణరావులకు కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. కమిషనర్‌తో పాటు కొంతమంది ఉద్యోగులను కార్యాలయం లోపలకు పంపించేందుకు పోలీసులు ముఖద్వారం వద్ద ఉన్న కార్మికులను బయటకు ఈడ్చేశారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల వైఖరికి నిరసనగా కార్మికులు నినాదాలు చేశారు. ఇంతలో పట్టణ సీఐ కృష్ణారావు చేరుకుని కార్మికులను శాంతిపజేశారు. ఇంతలో మున్సిపల్‌ కమిషనర్‌ రామ అప్పలనాయుడు, కార్మికుల వద్దకు వచ్చి.. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.మన్మఽథరావు, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- సాలూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయంలోకి వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకున్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌లు , పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె, చెప్పులు ఇవ్వాలని కోరారు. ఇంతలో పట్టణ ఎస్‌ఐ భాస్కరరావు తన సిబ్బందితో అక్కడకు వచ్చి ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తమ సిబ్బందితో కార్యాలయం అవరణంలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌వై.నాయుడు , పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రాముడు, శంకర్‌, టి.ఇందు, శ్రీను,రవి తదితరులు పాల్గొన్నారు.

- వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు పారిశుధ్య సిబ్బంది పాలకొండ నగరపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ముట్టడిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య మధ్య వాగ్వాదం జరిగింది. సీఐటీయూ నాయకులు రమణారావు, కాద రాముతో పాటు 58 మున్సిపల్‌ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ నిరసనలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌, ఇంజనీరింగ్‌, ఎలక్ర్టికల్‌, వాటర్‌ సెక్షన్‌, కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:34:50+05:30 IST