కొత్తవారు రారు.. ఉన్నోళ్లు సరిపోరు!

ABN , First Publish Date - 2023-03-31T00:06:50+05:30 IST

ప్రభుత్వ పాలనలో ఎంపీడీవోలే ‘కీ’లకం. కానీ జిల్లాలో పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు లేరు. దీంతో ఇన్‌చార్జిలే దిక్కవుతున్నారు. దీనికితోడు ఉన్న ఎంపీడీవోలు సైతం శిక్షణలు, ఇతరత్రా కారణాలతో వెళుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండేది.

కొత్తవారు రారు.. ఉన్నోళ్లు సరిపోరు!

కొత్తవారు రారు.. ఉన్నోళ్లు సరిపోరు!

జిల్లాలో ఎంపీడీవోల కొరత

15 మండలాలకుగాను ఉన్నది ముగ్గురే..

దాదాపు అన్నిచోట్ల ఇన్‌చార్జిలే..

పాలనపై చూపుతున్న ప్రభావం

(పార్వతీపురం, ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాలనలో ఎంపీడీవోలే ‘కీ’లకం. కానీ జిల్లాలో పూర్తిస్థాయిలో ఎంపీడీవోలు లేరు. దీంతో ఇన్‌చార్జిలే దిక్కవుతున్నారు. దీనికితోడు ఉన్న ఎంపీడీవోలు సైతం శిక్షణలు, ఇతరత్రా కారణాలతో వెళుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండేది. కొత్త జిల్లాతో ఈ కష్టాలు తీరుతాయనుకుంటే ఇప్పుడు కూడా ఎంపీడీవోల కొరత వెంటాడుతోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన నలుగురు రెగ్యులర్‌ ఎంపీడీవోలు ఏప్రిల్‌ 1 నుంచి ఆరు నెలల పాటు శిక్షణకు వెళ్లనున్నారు. వీరి స్థానంలో ఇన్‌చార్జిలు రానున్నారు. జిల్లాలో మొత్తం 15 మండలాలకుగాను గుమ్మలక్ష్మీపురం,గరుగుబిల్లి, కురుపాం, మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంపీడీవోలు ఉన్నారు. అసలు రెగ్యులర్‌ ఎంపీడీవోల భర్తీ ఉద్దేశ్యం ఉందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

- పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి... పాలకొండ ఎంపీడీవోగా ఇన్‌చార్జి డి.త్రినాఽథులు కొనసాగుతున్నారు. కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా (ఏవో) విధులు నిర్వహిస్తున్నారు. వీరఘట్టం ఏవోగా ఉన్న కె.వెంకటరావు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉన్నారు. భామిని ఈవోపీఆర్‌డీగా ఉన్న జి.కృష్ణారావు ఇన్‌చార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్నారు. సీతంపేటలో ఉన్న రెగ్యులర్‌ ఎంపీడీవోగా కె.గీతాంజలి ఉన్నా.. ఆమె శిక్షణకు వెళుతుండడంతో ఇన్‌చార్జి నియామకం అనివార్యంగా మారింది.

- సాలూరు నియోజకవర్గానికి సంబంధించి పాచిపెంటకు రెగ్యులర్‌ ఎంపీడీవో గా పి.లక్ష్మీకాంత్‌ ఉన్నారు. ఆరు నెలల పాటు శిక్షణకు వెళుతున్నారు. దీంతో ఇక్కడ ఇన్‌చార్జి నియామకం అనివార్యం. సాలూరు ఏవో పార్వతి ఇన్‌చార్జ్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్నారు. మక్కువ మండలంలో ఈవోపీఆర్‌డీగా పనిచేస్తున్న దేవకుమార్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు.

- పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం రెగ్యులర్‌ ఎంపీడీవో జావెద్‌ శిక్షణకు వెళుతున్నారు. ఇక్కడ ఇన్‌చార్జి రానున్నారు. బలిజిపేట ఎంపీడీవోగా విజయనగరం జిల్లా మెంటాడ ఏవో ఏ.భానుమూర్తి విధులు నిర్వహిస్తున్నారు. సీతానగరం రెగ్యులర్‌ ఎంపీడీవో కృష్ణమహేష్‌రెడ్డి 6 నెలల శిక్షణకు వెళుతున్నారు. ఇక్కడ ఇన్‌చార్జి రానున్నారు.

- కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కొమరాడ ఎంపీడీవోగా అప్పారావు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈయన పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో రెగ్యులర్‌ ఏవోగా ఉంటూ అదనపు బాఽధ్యతలు చూస్తున్నారు. జియ్యమ్మవలస ఎంపీడీవోగా ఏవో రమేష్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కురుపాం ఎంపీడీవో సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో జూనియర్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉన్నారు.

Updated Date - 2023-03-31T00:06:50+05:30 IST