ఆడాల్సిందే!
ABN , First Publish Date - 2023-12-11T00:16:27+05:30 IST
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 15 నుంచి జనవరి 24 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
- ‘ఆడుదాం ఆంధ్రా’లో పాల్గొనాలని వలంటీర్ల ఒత్తిళ్లు
- అయినా ప్రజల నుంచి స్పందన కరువు
- బలవంతంగా రిజిస్ట్రేషన్లు
(గరుగుబిల్లి)
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 15 నుంచి జనవరి 24 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించింది. దీనికోసం గత నెల 27 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేవారు తమ వివరాలను నమోదు చేసుకొనేందుకు ప్రత్యేక లింక్ ఏర్పాటు చేశారు. అలాగే 1902కు ఫోన్ చేసి పేరును నమోదు చేసుకోవచ్చు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, ఈ బాధ్యతలను జిల్లా అధికారులు, సంబంధిత మండల అభివృద్ధి అధికారులు, ఎంఈవోలకు అప్పగించారు. వీరు సచివాలయాల పరిధిలోని కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, వలంటీర్లకు అప్పగించారు. దీంతో గ్రామస్థాయిలో ఆధార్ నెంబరుతో పాటు 15 సంవత్సరాలు నిండిన వారి వివరాలకై గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటా ప్రదక్షిణలు చేస్తున్నారు. క్రీడలపై అవగాహన కల్పిస్తున్నా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే వీరి తలనొప్పిని భరించలేక పలువురు ఆడినా, ఆడకపోయినా కొంతమేర సమాచారం అందించి చేతులు దులుపుకొంటున్నారు. రిజిస్ట్రేషన్లకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అర్హులైతే ఎక్కువే ఉన్నారు కానీ ఖాళీగా లేరు. ఎవరిని కదిలించినా ఇప్పుడైతే రాలేమంటున్నారు. యువకుల నుంచి మహిళలు, పెద్దలు, రైతులు ఇలా ఎవరిని పిలిచినా రాంరాం అంటున్నారు. అయినా కాని టార్గెట్‌లు ఇవ్వడంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఆధార్‌లు తీసుకుని పేర్లు నమోదు చేసేస్తున్నారు. మరోవైపు జిల్లా కీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కిట్లు అందిస్తామని ఆశ చూపి క్రీడల్లో పాల్గొనాలని వలంటీర్లు బలవంతం చేస్తున్నారు. ఆటలంటే స్వయంగా ముందుకు రావాలి. కానీ బలవంతంగా రుద్దే కార్యక్రమం గ్రామాల్లో సాగుతోంది. ప్రజల నుంచి కనీస స్పందన కానరావడం లేదు. కొందరు బతిమలాడి పేర్లు తీసుకుంటున్నారు. ఆటల్లో ప్రవేశం లేదు.. ఎప్పుడూ తాము క్రీడల్లో పాల్గొనలేదని మొర పెట్టుకుంటున్నా పర్వాలేదు చూసేందుకైనా రండి అంటూ బలవంతంగా పేర్లు నమోదు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువ మంది నేడు పొలంబాట పడుతున్నారు. పంట సంరక్షణలో నిమగ్నమయ్యారు. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో వలంటీర్లు ఇళ్లకు వెళ్తున్నారు. పేర్లు నమోదు చేసుకోని పక్షంలో ఇబ్బందుల్లో పడతారని కొందరు భయపెడుతున్నారు. ఈ పరిస్థితిలో కొన్నిచోట్ల వలంటీర్లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- రైతులు సాగు పనుల్లో ఉండగా వారి పిల్లలు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ.. లేదంటే ఇతర చోట్ల చిరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. స్థానికంగా పనులు లేక వలసవెళ్లిన యువకులు కూడా అనేకం. మహిళలు కూడా స్వయంశక్తిపై కాని, కుటీర పరిశ్రమల్లో కాని పనులు చేసుకుంటున్నారు. ఎవరూ ఆటలాడేందుకు ఆసక్తి చూపడం లేదు.
- ఎన్నికల ప్రచారాల్లో యువతను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాలు క్రీడా కిట్లు అందిస్తుంటాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల్లో చేస్తున్న తతంగం ఇది. కాని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ఐదు నెలల ముందే క్రీడా పోటీల పేరుతో యువతకు గాలం విసురుతోందన్న విమర్శలూ ఉన్నాయి.
- సీఎం జగన్ ఫొటోతో ఉన్న ఒక క్రీడా కిట్టును ప్రతి సచివాలయానికి అందిస్తున్నారు. ఇందులో రెండు క్రికెట్ బ్యాట్లు, ఒక వాలీబాల్, నెట్, రెండు రింగులు(రింగ్‌టెన్నిస్), బ్యాట్‌మెంటెన్‌కు చెందిన రెండు బ్యాట్లు అందిస్తు న్నారు. ప్రతి కిట్టుపైనా ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించారు. క్రీడల నిర్వహణ కంటే కిట్లు పంపిణీయే ప్రధానం అన్నట్లు పరిస్థితి కన్పిస్తోంది.
బహుమతులు ఆశచూపినా..
నియోజకవర్గం స్థాయిలో ప్రతిభకనబరిస్తే మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ. 10వేలు, జిల్లాస్థాయిలో మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, రాష్ట్రస్థాయిలో మొదటి విజేతకు రూ.5 లక్షలు, రెండో విజేతకు రూ.3లక్షలుగా ప్రకటించారు. భారీ మొత్తంలో బహుమతులు ప్రకటిస్తే ప్రజలు ఆకర్శితులవుతారని ప్రభుత్వం భావించింది. కానీ, పోటీల్లో పాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల మేరకు క్రీడలు నిర్వహించాల్సిందే
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సచివాలయాల పరిధిలో ఈ నెల 15 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహించాల్సిందే. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకే ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. క్రీడలపై అవగాహన కల్పించాలి. పోటీలు నిర్వహణకు సచివాలయాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని పంపిణీ చేశాం.
-జి.పైడి తల్లి, ఎంపీడీవో, గరుగుబిల్లి మండలం